రాజకీయాలపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ సంచలన కామెంట్స్
'సిగ్గు, లజ్జ అన్నీ వదిలేస్తేనే రాజకీయాల్లోకి..'
X
"బాగా చదువుకుని, బాగా సంపాదిస్తే, ఇంట్లోనే హ్యాపీగా ఉండండి. అంతే తప్ప రాజకీయాల్లోకి రాకండి" అంటూ రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేశారు టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు. రాజకీయాల్లోకి రావాలంటే సిగ్గు, లజ్జ అన్నీ వదిలేసి రావాలన్నారు. రీసెంట్‌గా విడుదలైన తన సినిమా ‘కోట బొమ్మాళి పీఎస్’ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఈ కామెంట్స్.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
మలయాళం సినిమా 'నయట్టు' కి రీమేక్ గా రూపొందిన ‘కోట బొమ్మాళి పీఎస్' ఈ నెల 24న థియేటర్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరించారు. 'జోహార్', 'అర్జున ఫాల్గుణ' సినిమాలకు దర్శకత్వం వహించిన తేజ మార్ని కోట బొమ్మాళి పీస్ ను తెరకెక్కించగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. తాజాగా, హైదరాబాద్‌లో ఈ సినిమా 'థాంక్యూ మీట్'లో భాగంగా చిత్ర నిర్మాత బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాలిటిక్స్ గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు.. బాగా ఎడ్యుకేటెడ్, బాగా సంపాదించి ఉంటే హ్యాపీ గా ఇంట్లో ఉండండి తప్ప రాజకీయాల్లోకి రావొద్దని చెప్తాను. ఎందుకంటే, ఈరోజు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలంటే సిగ్గు, లజ్జ అన్నీ వదిలేసి.. నన్ను ఎవ్వరు తిట్టినా ఫర్వాలేదు, నా ఫ్యామిలీ ఫొటోస్ ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టినా పర్వాలేదు. నా కూతురు, పెళ్లాం ఎవ్వరిని ఏమన్నా నాకేం పట్టదు అన్నట్టు ఉండాలి. బట్టలిప్పి రోడ్డు మీద నిలబడగలిగిన వాడే ఈరోజు రాజకీయాల్లోకి వెళ్లగలడు కానీ.. ఒక విద్యావంతుడు, ఆత్మాభిమానం ఉన్నవాడు, ఒక చిన్న మాటన్నా హర్ట్ అయ్యేవాడు ఈరోజు రాజకీయాలకు పనిచేయడు’’ అంటూ చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత మరి 2029 లో మీరు ఎలా రెడీ అవుతున్నారు? అని అడగ్గా.. అవ్వాలి! నేను పోటీ చేయాలంటే వంద శాతం నేను అలా అవ్వాలి. అలాంటి మానసిక శక్తి, స్ట్రాంగ్ బ్రెయిన్ నాకు లేకపోతే నేను ఇంట్లో కూర్చోవడం మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం రాజకీయాల్లోకి వెళ్లాలంటే మనం షర్ట్ విప్పి రోడ్డు మీద తిరగగలగాలి. అంత మానసిక శక్తి లేకుండా నేను రాజకీయాల్లోకి వెళ్తే కన్‌ఫ్యూజ్ అయ్యి, బాధపడి, రోజూ రాత్రిళ్లు నిద్రపట్టకుండా దొర్లడం తప్పితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అన్నింటికీ ప్రిపేర్ అయ్యే వెళ్లాలి. అలా ప్రిపేర్ అయిన రోజు నేను వెళ్తాను’’ అని అన్నారు.