Tollywood Reaction : కాంగ్రెస్ గెలుపుపై టాలీవుడ్ ఫస్ట్ రియాక్షన్
X
సినిమా పరిశ్రమ అంటే ప్రభుత్వాల పరంగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టేలా ఉంటుంది. ఎవరినీ నొప్పించక తానొవ్వక అన్నట్టుగానే వెళుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత మాత్రం ఈ సంప్రదాయాన్ని వదిలేసింది. జగన్ ను సిఎమ్ గా అంగీకరించడానికి ఇప్పటికీ ఇండస్ట్రీకి మనసులేదు. ఏదో మొక్కుబడిగా కొన్నిసార్లు మాటలు చెప్పినా.. అతను గెలిచిన తర్వాత పరిశ్రమ నుంచి ఎవ్వరూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పలేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుండటం విశేషం.
టాలీవుడ్ కు హైదరాబాద్ ఎప్పుడూ బెస్ట్ ప్లేస్. అందుకే తెలంగాణ ప్రభుత్వంతో తిరుగులేని రాపో మెయిన్టేన్ చేసింది. కేటీఆర్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు చీఫ్ గెస్ట్ గానూ అనేకసార్లు అటెండ్ అయ్యాడు.ఇక సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే లెక్కేలేదు. ఒక రకంగా ప్రభుత్వంతో పూర్తిగా సత్సంబంధాలే నెరిపింది టాలీవుడ్. కానీ ఎందుకో ఇప్పుడు కాంగ్రెస్ గెలవగానే సడెన్ గా సైలెంట్ అయిపోయింది. ఎవరూ ముందుకు వచ్చి ధైర్యంగా శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నారు.
కాకపోతే హీరో నితిన్ మాత్రం గెలిచిన కాంగ్రెస్ తో పాటు రేవంత్ కు శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్(ట్విట్టర్)లో రియాక్ట్ అయ్యాడు. ఒక రకంగా టాలీవుడ్ నుంచి ఇదే ఫస్ట్ రియాక్షన్ అని చెప్పాలి. మొన్నటి వరకూ కాంగ్రెస్ లోనే ఉన్న చిరంజీవి కానీ, ఇతర స్టార్ హీరోలు కానీ ఎవరూ స్పందించలేదు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడం టాలీవుడ్ కు ఇష్టం లేదా .. లేక వెంటనే రియాక్ట్ అయితే ఇప్పటి వరకూ మంచి రాపో మెయిన్టేన్ చేసిన కేటీఆర్, కేసీఆర్ ఫీల్ అవుతారనుకున్నారా అనేది చెప్పలేం కానీ.. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇకపై తెలంగాణను పాలించబోయేది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల వారికి అవసరమైన పనులు చేయించుకోవాలన్నా.. సమస్యలు పరిష్కరించుకోవాలన్నా.. ఈ ప్రభుత్వంతోనూ సత్సంబంధాలు నెరపాల్సిందే.