'జైభీమ్'పై రానా స్పందన
X
కేంద్ర సర్కార్ ఇటీవల జాతీయ అవార్డులను ప్రకటించింది. అయితే ఆ జాబితాలో తమిళ సూపర్ స్టార్ సూర్య కథానాయకుడిగా నటించిన ‘జైభీమ్’ సినిమా లేకపోవడంపై ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ఇండస్ట్రీలోని చాలా మంది నిరాశపడ్డారు. అంతే కాదు సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు తమ స్పందనను తెలియజేశారు. అయితే వాటిలో కొన్ని పోస్టులు మాత్రం తీవ్ర దుమారం రేపాయి. పెద్ద చర్చకు దారితీశాయి. మరికొన్ని వివాదాలకు దారితీశాయి. తాజాగా ఇదే విషయంపై టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి స్పందించాడు. సైమా అవార్డులకు సంబంధించి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ అంశంపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
"సినిమాల విషయంలో అందరికీ ఒకే రకమైన ఒపీనియన్ ఉండదు. ఒకరికి ఒక సినిమా నచ్చవచ్చు. నాకు ఇంకో సినిమా బాగుంది అని అనిపించవచ్చు. హీరోల టేస్టులు కూడా అదే విధంగా ఉంటాయి. నిజానికి ‘జైభీమ్’ మూవీకి జాతీయ అవార్డు వస్తుందని అందరూ భావించారు. కానీ ఆ సినిమా ఎంపిక కాలేదు. ఈ విషయంలో నిరుత్సాహంతో కొందరు వారి అభిప్రాయాన్ని ట్విటర్లో తెలిపారు. అంతేకానీ ఈ అవార్డులను ఏదో కాంట్రవర్సీ చేయాలని మాత్రం వారి ఉద్దేశం కానే కాదు. కేవలం వారు ట్వీట్ మాత్రమే చేశారు. కానీ కొందరు దానిని కాంట్రవర్సీ చేసి పెద్ద చర్చనీయాంశంగా మార్చారు. మా ఆర్టిస్టుల మధ్య నిజానికి ఎలాంటి వివాదాలు ఉండవు" అని రానా తెలిపాడు.
కేంద్రం జాతీయ అవార్డులను అనౌన్స్ చేయగానే చాలా మంది సినీ సెలబ్రిటీలు ట్వీట్స్ చేశారు. అందులో హీరో నాని కూడా ఉన్నాడు. ‘జైభీమ్’కు జాతీయ అవార్డు రాకపోవడంతో తన హృదయం ముక్కలైందని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. ఇదే బాటలో తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ జాతీయ అవార్డులపై పలు ఇంటర్వ్యూల్లో తమ అభిప్రాయాన్ని తెలిపారు.