Home > సినిమా > ట్రూ లవర్ రివ్యూ

ట్రూ లవర్ రివ్యూ

ట్రూ లవర్ రివ్యూ
X

రివ్యూ : ట్రూ లవర్
తారాగణం : మణికందన్, శ్రీ గౌరీ ప్రియ, కన్నా రవి, హరీష్, శరవణన్, హరిణి సుందరరాజన్
ఎడిటర్ : భరత్ విక్రమన్
సంగీతం : శాన్ రోనాల్డన్
సినిమాటోగ్రఫీ : శ్రేయాస్ కృష్ణ
నిర్మాతలు : మారుతి, ఎస్కేఎన్(తెలుగు విడుదల)
దర్శకత్వం : ప్రభురామ్ వ్యాస్

తమిళ్ నుంచి చిన్న హీరోలతో లవ్ స్టోరీస్ వచ్చాయంటే తెలుగులో బాగా ఆకట్టుకుంటాయనే సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉంది. ఈ మధ్య ఈ ట్రెండ్ కాస్త తగ్గింది కానీ ఒకప్పుడు కోలీవుడ్ మినీ లవ్ స్టోరీస్ తెలుగులోనూ ఊపేశాయి. ఈ సినిమాలన్నీ చాలా రియలిస్టిక్ గా ఉండటమే అందుకు ప్రధాన కారణం. ఇక లేటెస్ట్ గా ట్రూ లవర్ అంటూ మరో సినిమా వచ్చింది. బేబీతో కల్ట్ మూవీ తీశాం అని సంబర పడుతున్న ఎస్కేఎన్ తో పాటు దర్శకుడు మారుతి కూడా కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. ఈ శనివారం విడుదలైన ట్రూ లవర్ ఎలా ఉందనేది ఈ మినీ రివ్యూలో చూద్దాం.

ట్రూ లవర్ సినిమా కథ చూస్తే.. అరుణ్, దివ్య కాలేజ్ డేస్ నుంచి ప్రేమించుకుంటారు. చదువు పూర్తయిన తర్వాత దివ్య ఓ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటుంది. అరుణ్ సొంతంగా బిజినెస్ పెట్టే ప్రయత్నంలో ఉంటాడు. కానీ సెట్ కాదు. దీంతో ఫ్రెండ్స్ తో తిరుగుతూ.. అదే పనిగా మందు కొడుతూ.. ఉంటాడు. ఇటు దివ్య తన ఆఫీస్ లో చేరిన మదన్ తో స్నేహంగా ఉంటూ.. ఇతర మిత్రులతో కలిసి వెకేషన్స్ కు వెళుతుంది. ఆ విషయం అరుణ్ కు చెప్పదు. తనకు చెప్పుకుండా వేరే ఫ్రెండ్స్ తో తిరుగుతుందని తెలుసుకున్న అరుణ్ ఆమెతో వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు. అలా చాలాసార్లు ఇద్దరూ గొడవ పడతారు. ఓ దశలో దివ్య ఇక తన వల్ల కాదని.. విడిపోదాం అని చెబుతుంది. మరి ఆరేళ్లుగా ప్రేమించుకున్న వీరికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది..? దివ్య చెప్పినట్టుగానే విడిపోయారా లేక కలిసే ఉన్నారా అనేది మిగతా కథ.

ఏ ప్రేమకథలో అయినా ప్రధాన విలన్స్ గా పేరెంట్స్, కులం, మతం, లేదా అంతస్తులు అనేది ఇప్పటి వరకూ చూసిన అనేక సినిమాలు చెప్పాయి. బట్ అసలైన విలన్ మన వ్యక్తిత్వమే అనేది ఈ ట్రూ లవర్ చెప్పే సందేశం. యస్.. ఏ ప్రేమ అయినా గెలవాలన్నా ఓడిపోవాలన్నా అది వారి వ్యక్తిత్వం మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు ప్రభురామ్ వ్యాస్. ప్రేమలో ఉన్నాం కాబట్టి ఆమెపై తనకు అన్ని అధికారాలూ ఉన్నాయనుకున్న ఓ కుర్రాడు.. అసలే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నవాడికి తను వేరే స్నేహితులతో తిరుగుతున్నానని తెలిస్తే ఎక్కడ అపార్థం చేసుకుంటాడో అని చెప్పకుండా వెళ్లే అమ్మాయి.. ఈ వ్యవహారంలో ఒకరి గురించి ఒకరికి నిజాలు తెలిసిన తర్వాత ఎదురయ్యే అపోహలు, అపార్థాలు.. ఆవేశాలు.. వెరసి తిట్టుకోవడం, అవమానించుకోవడం అనే అంశాల వరకూ వెళ్లడం.. ఓ దశలో అమ్మాయి ప్రేమ కోసం అబ్బాయి ఆమె చెప్పినట్టే ఉద్యోగంలో చేరడం.. అటుపై తనకు సాయం చేస్తానన్న మనుషులు మోసం చేయడంతో ఆ బాధలో ఉద్యోగమూ పోగొట్టుకుని మరోసారి అమ్మాయి నమ్మకాన్ని కోల్పోవడం.. ఇలాంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి ఈ సినిమాలో. ఈ క్రమంలో చాలాసార్లు సాగదీస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మందు, సిగరెట్ తాగడం లేని సీన్ లేదంటే అర్థం చేసుకోవచ్చు.. దర్శకుడు ఈ కథను ఎంత నిజాయితీగా రాసుకున్నాడో. ఈ సీన్స్ లేకుండా కూడా ఈ సీన్స్ రక్తి కడతాయి.కానీ అతను వాటికి చాలా దగ్గరగా వెళ్లడం అర్థ రహితంగా అనిపిస్తుంది. బట్ ఇది ఈ తరం కథగా చెప్పాడు. ప్రస్తుతం యువతరం ఇలాగే ఉందనే కోణంలోనే కథ చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకే అవి అనివార్యం అయ్యాయి అని సంజాయిషీ ఇచ్చుకుంటారేమో. మొత్తంగా కొంత వరకూ యువతరానికి బాగా కనెక్ట్ అయ్యే అంశాలు చాలానే ఉన్నాయి. కానీ ధైర్యంగా ఉద్యోగం చేసుకునే అమ్మాయిని విలన్ గా చూపించాలనుకోవడం ఏంటో అర్థం కాదు. అయినా ఆశలు, ఆశయాలు, లక్ష్యాల నడుమ కొన్ని రిలేషన్స్ లో ఒడిదుడుకులు వస్తాయి. వాటిని తట్టుకుని నిలబడితేనే ప్రేమ గెలుస్తుందనే మెసేజ్ ను కూడా అందిస్తాడు. హీరో తల్లితండ్రుల కోణంలో కొంత కథ చెప్పాడు. కానీ హీరోయిన్ పేరెంట్స్ కు సంబంధించిన ఊసే లేదీ సినిమాలో. టెక్నికల్ గా బావుంది. మంచి సనిమాటోగ్రఫీ, పాటలు, నేపథ్య సంగీతం అన్నీ బావున్నాయి. దర్శకుడు ఒక వర్గం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించినట్టుగా ఉంది కాబట్టి.. కొన్ని కంప్లైంట్స్ ఉన్నా.. ఆ వర్గం ప్రేక్షకులను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేరుతుందని చెప్పొచ్చు.

ప్రేమంటే ఓ మధురం. ప్రేమంటే ఓ కావ్యం, ప్రేమలో గెలిస్తే.. ప్రపంచాన్ని జయించినట్టే.. అంటూ ప్రేమలో ఉన్నవాళ్లు అనేక కవిత్వాలు రాసుకున్నారు. కానీ ప్రేమంటే నిరంతర యుద్ధం, నిత్య పోరాటం, ప్రతి రోజూ ఓ పరీక్ష లాంటిదే.. అప్పుడే అది సజీవంగా ఉన్నట్టు అనే ఓ ఇంగ్లీష్ కొటేషన్ తో ముగించాడు దర్శకుడు. ఫైనల్ గా ఆ కొటేషన్ కు న్యాయం చేసే సినిమా ఇది. అందుకే ట్రూ లవర్ అన్నాడు. అంటే ట్రూ లవర్ అంటే ఎలా ఉండాలి అనే నిర్వచనంలానూ చూపించాడు. ఫైనల్ గా ఈ ట్రూ లవర్ నేటి తరం లవర్స్ ను మెప్పించే అవకాశాలున్నాయి.

ఫైనల్ గా : హానెస్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్

రేటింగ్ : 2.75/5

Updated : 10 Feb 2024 12:14 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top