వ్యూహం రిలీజ్పై కొనసాగుతున్న సస్పెన్స్.. హైకోర్టు కీలక ఆదేశం..
X
వ్యూహం సినిమా విడుదలకు న్యాయపరమైన చిక్కులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్కు అనుమతించాలంటూ నిర్మాత దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. వ్యూహం మూవీపై కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. కమిటీ సభ్యుల్ని పిటిషనర్ , ప్రతివాదులు కలిసి ఎంచుకోవాలని సూచించింది. రెండు పక్షాలు తమ నిర్ణయాన్ని మధ్యాహ్నం కల్లా ధర్మాసనానికి చెప్పాలని స్పష్టం చేసింది.
విచారణ సందర్భంగా న్యాయస్థానం గతంలో ఇలాంటి అంశంపై బాంబే హైకోర్టు కమిటీ వేసిన విషయాన్ని గుర్తు చేసింది. కమిటీ సభ్యులకు వ్యూహం సినిమా చూపించాలని శుక్రవారంలోపు వారు రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
వ్యూహం సినిమా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్లను కించపరిచేలా ఉందంటూ నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన సింగిల్ బెంచ్ ఈ నెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిత్ర నిర్మాత డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు.