Director Krish : డ్రగ్స్ కేసులో ట్విస్ట్..రేపు విచారణకు రానున్న క్రిష్
X
హైదరాబాద్ గచ్చిబౌలిలో రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో రోజుకో ట్విస్ట్ నెలకొంటోంది. ఈ కేసులు బడా వ్యాపారులు, సినీ సెలబ్రిటీలు ఉన్నారు. అందుకే పోలీసులు ఆచితూచి కేసు విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 10 మందిపై కేసు ఫైల్ చేశారు. అందులో నలుగురిని అరెస్ట్ చేశారు. మిగిలినవారు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ కేసులో కొత్తగా మరికొంత మంది పేర్లు బయటకు వస్తున్నాయి.
రాడిసన్ హోటల్‌లో అరెస్ట్ అయిన నిందితుల ఫోన్ డేటా, లావాదేవీల ఆధారంగా పోలీసులు మరికొంతమంది వివరాలు సేకరించారు. పోలీసుల విచారణలో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. రాడిసన్ బ్లూ హోటల్‌లో ఇల్లీగల్ దందా జరుగుతోందనే విషయం ఒక్కొక్కటిగా బయటికి వస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతి వీకెండ్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందని విచారణలో తేలింది. దేశ, విదేశాల నుంచి చాలా మంది ప్రముఖులు ఈ రాడిసన్ హోటల్‌లోనే బస చేస్తుంటారు. అటువంటి హోటల్‌లో సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడం కొత్త అనుమానాలను కలిగిస్తోంది.
ఇకపోతే ఈ డ్రగ్స్ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్ కూడా హాజరైనట్లు తేలింది. పోలీసులు ఆయన్ని విచారణకు పిలవగా శుక్రవారం వస్తానని చెప్పారట. మరోవైపు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని పోలీసులు చెబుతున్నారు. క్రిష్ ముంబైకి వెళ్లిపోయినట్లు మరికొందరు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే రఘుచరణ్, సందీప్, నీల్, శ్వేత, యూట్యూబర్ లిషి పరారీలో ఉన్నారు. మరోవైపు రాడిసన్ హోటల్‌లో మొత్తం 200 సీసీ కెమెరాలు ఉండగా వాటిలో 20 మాత్రమే పనిచేయడం ఈ కేసుకు సవాలుగా మారింది. మొత్తానికి రేపు క్రిష్ విచారణకు హాజరవుతారో, లేకుంటే విచారణకు రాకుండా మాటను దాటవేస్తారో అనేది తెలియాలంటే రేపటి వరకూ వేచి ఉండాల్సిందే.