సింగిల్స్ మదర్స్ కు ఉపాసన గుడ్‌న్యూస్...వారి మొహాల్లో ఆనందం కోసమే !
X
రామ్ చరణ్ ఉపాసన జంట ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లైన కొద్దిరోజులకే ఉపాసన తన మంచి మనసును చాటుకున్నారు. ఒక తల్లిగా వారి కష్టాలు తెలుసుకున్న ఉపాసన సింగిల్ మదర్స్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. తోడులేని తల్లులకు అండగా నిల్చేందుకు నడుంబిగించారు. ఇకపై వారాంతాల్లో సింగిల్ మదర్స్ తమ పిల్లలను అపోలో చిల్డ్రన్ హాస్పిటల్స్‌కు తీసుకువెళ్లి ఉచితంగా వైద్యం (డాక్టర్ కన్సల్టెన్సీ - ఓపీడీ) పొందవచ్చని ప్రకటించారు.
ప్రత్యేకంగా చిన్నపిల్లలకు వైద్య సేవలు అందించడం కోసం అపోలో హాస్పిటల్స్‌కు అనుబంధంగా అపోలో చిల్డ్రన్స్ బ్రాండ్‌ను సోమవారం ఉపాసన లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను గర్భం దాల్చిన తరువాత అందరూ తనపై ఎంతో ప్రేమను కురిపించారని, ఆశీస్సులు అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్‌ను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారని..ఆ పిల్లను సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడం తమ బాధ్యత అని చెప్పారు.
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొంతమంది తల్లుల ఆవేదనను తానుచూశానని..వాళ్లలో సింగిల్స్ మదర్స్ ఎక్కువగా ఉన్నారన్నారు. దీంతో వారికి తోడుగా ఉండే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
" ఇకపై వారాంతాల్లో సింగిల్ మదర్స్ తమ పిల్లలను అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్‌కు తీసుకెళ్లి ఉచితంగా వైద్యం (ఓపీడీ) పొందుచ్చు. ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది సింగిల్ మదర్స్‌కు, వారి పిల్లలకు లాభం చేకూరుతుందని నేను భావిస్తున్నాను. నేను వాళ్లకు ఎప్పుడూ ప్రోత్సహం ఇస్తాను. ఇదొక ఎమోషనల్ జర్నీ. నేను ఫీల్ అయినట్టే.. ఆ తల్లులు కూడా ఫీలవ్వాలి’ అని ఉపాసన తెలిపారు.
అదృష్టవశాత్తు తనకు ఒక మంచి భర్త దొరికాడని.. బిడ్డ ఆలనాపాలనా చూసుకోవడంతో ఆయన కూడా ఎంతగానో సహకరిస్తారని చెప్పారు. అయితే, భర్త సాయం లేకుండా పిల్లలను పోషించే తల్లుల పరిస్థితి ఏంటని ఉపాసన ప్రశ్నించారు. అలాంటి తల్లుల బాధను తెలుసుకున్నాను కాబట్టే వాళ్లకు వారాంతాల్లో డాక్టర్ కన్సల్టెన్సీ ఉచితంగా అందిస్తామని ప్రకటించినట్టు ఉపాసన వివరించారు. ఉపాసన నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.