చిరంజీవి గారి మాటే నిజమైంది.. ఉప్పెన దర్శకుడు
X
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ ఫిలిం అవార్డ్స్ (69th National Film Awards 2023)లో... ఒక్క టాలీవుడ్ నుంచే తెలుగు సినిమాలకు 10 జాతీయ అవార్డులు దక్కాయి. తాజాగా వచ్చిన అవార్డులు తెలుగు చలన చిత్ర పరిశ్రమ (Tollywood)ఖ్యాతిని మరోసారి గ్లోబల్ ఇండస్ట్రీకి చాటిచెబుతున్నాయి. ఇప్పటికే ఆస్కార్ విన్నర్‌గా నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్ (RRR)సినిమాకు తాజా నేషనల్ అవార్డుల్లో వివిధ విభాగాల్లో 6 పురస్కారాలు దక్కాయి. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికై తిరుగులేని ట్రెండ్ సెట్ చేశాడు. ఇదే సినిమాకు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవీ శ్రీ ప్రసాద్ నిలిచాడు. ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ (కొండపొలం), ఉత్తమ సినిమాగా ఉప్పెన ఒక్కో అవార్డు అందుకున్నాయి.
2021 సంవత్సరానికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ (Uppena) ఎంపికైంది. దీంతో దర్శకుడు బుచ్చిబాబు (Buchibabu) సంతోషంలో మునిగిపోయారు. తొలి చిత్రంతోనే ఇంతటి ఘనతను సాధించినదుకు ఆనందంతో ఆయన మిత్రులు కేరింతలు కొట్టారు. తొలి అడుగులోనే రూ.100కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి సత్తా చాటిన ఈ ప్రేమ కథా చిత్రం.. జాతీయ పురస్కారం కూడా దక్కించుకోవడంతో బుచ్చిబాబు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్. అవార్డు ప్రకటించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేనైతే అవార్డుల్ని దృష్టిలో పెట్టుకొని సినిమా చేయలేదు. కానీ, ఈ కథ చెప్పిన వెంటనే చిరంజీవి ‘ఈ సినిమా నీకెన్నో అవార్డులు తీసుకొస్తుంది. జాతీయ అవార్డు కూడా వస్తుంద’ని చెప్పారు. మా గురువు సుకుమార్‌కు చెప్పినప్పుడు ఆయనా ఇదే మాట అన్నారు. ఈరోజు వారి మాటలు నిజమయ్యాయి. ప్రేక్షకులు నాకు తొలి ప్రయత్నంలోనే రూ:100కోట్ల వసూళ్లు ఇచ్చారు. ఆ తర్వాత ఏం వచ్చినా బోనస్ అనే అనుకున్నా. ఇప్పుడీ పురస్కారంతో నాపై బాధ్యత మరింత పెరిగింది’’ అని అన్నారు.