Venkaiah Naidu : హనుమాన్ సినిమా చూసిన వెంకయ్య.. మూవీ టీంపై ప్రశంసలు..
X
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేస్తోన్న మూవీ హనుమాన్. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ థియేటర్లలో అదరగొడుతోంది. ఇప్పటివరకు రూ.250 కోట్లు కొల్లగొట్టి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. ఒక సింపుల్ ప్లాట్కు హనుమాన్ శక్తిని ఆపాదించి ఆ ఇంపాక్ట్ ఆడియన్స్లో కలిగించడంలో ప్రశాంత్ వర్మ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఎంతోమంది ప్రముఖులు సైతం ఈ సినిమాను మెచ్చుకున్నారు. తాజాగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హనుమాన్ మూవీపై ప్రశంసలు కురిపించారు.
హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో తన స్నేహితులతో కలిసి వెంకయ్య హనుమాన్ చిత్రాన్ని వీక్షించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో తెలిపారు. ‘‘డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. భారతీయ ఇతిహాస వీరుల్లో ఒకరైన శ్రీ ఆంజనేయస్వామి స్ఫూర్తిగా తెరకెక్కించిన ఈ చిత్రంలోని ప్రతిఘట్టం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ ఉన్నతంగా ఉన్నాయి. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ సహా ఇతర నటుల నటన ఆకట్టుకుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్ వర్మకు అభినందనలు’’ అని వెంకయ్య ట్వీట్ చేశారు. దీనికి హనుమాన్ టీంతో ఉన్న ఫొటోను జత చేశారు.