కడుపు మోస్తే నేరమా.. మిస్టర్ ప్రెగ్నెంట్ నుంచి ఎమోషనల్ సాంగ్
X
బిడ్డకు జన్మనివ్వడానికి ప్రాణాలు పణంగా పెడుతుంది తల్లి. రక్తమాంసాలు పంచి పండంటి బిడ్డను లోకానికి ప్రసాదించే ఆ మాతృమూర్తి రుణం ఏమిచ్చినా తీరదు. తొమ్మిదినెలలు గర్భం మోయడం, ప్రసవించడం ఎంత మధురానుభూతి ఇస్తాయో అంతే భారమైనవి. ఆ కష్టం అనుభవించినవారికే తెలుస్తుంది తప్ప మగవాడికి తెలియదు. మగవాడు గర్భం ధరిస్తే ఎలా ఉంటుంది, ప్రసవవేదనను ఎలా భరిస్తాడు అనే ఆసక్తికర కథతో తెరెక్కిన మూవీవీ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ మూవీని నవరసాలు జోడించి తీశారు. ఈ నెల 18న విడుదల కానున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ప్రచారంలో భాగంగా బుధవారం మూవీలోని ‘వినరా ఈశ్వరా, కనరా లోకేశ్వరా’ పాటను విడుదల చేశారు. హీరో గర్భం దాల్చితే లోకం ఏమనుకుంటుందో ఈ పాట కళ్లకు కడుతుంది.
వినరా ఈశ్వరా కనరా లోకేశ్వరా
విధికే వింతరా జరిగే కథా
తనలో తల్లినీ మలిచే తండ్రినీ తరిమే
లోకమే తలారిగా.. ఆలికే తనువు పంచినా దైవమా
మనిషి ఇస్తే ద్రోహమా.. కడుపు మోస్తే నేరమా..
నిన్ను పొగిడినా లోకులే నన్ను పొడిచెనూ కాకులై..
అంటూ బాధతో, ఆక్రోశంతో సాగుతుందీ పాట. కల్యాణ్ చక్రవర్తి రాసిన ఈ గీతాన్ని కాలభైరవ ఆలపించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమాకూర్చారు. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ రేయాన్ ‘మగ తల్లి’గా ఉద్వేగంతో నటించారు. ఈ చిత్రంలోని హే చెలీ, ఉల్టాపల్టా వంటి పాటలను జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. రూపా కొడవాయుర్ హీరోయిన్ కాగా సుహాసిని, రాజారవీంద్ర, బ్రహ్మాజీ తదితరులు నటించారు. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంతో తెరకెక్కిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ను మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. ఇందులో ఇది మామూలు సినిమా కాదని, చూసిన ప్రేక్షకులందరూ తమ తల్లులకు పాదాభివందనం చేస్తారని మూవీ టీమ్ చెబుతోంది. వింత కథతో నవ్వించడంతోపాటు చక్కని ప్రేమకథ దీనికి హైలెట్. మైక్ మూవీస్ బ్యానర్‌పై వచ్చిన ‘స్లమ్‌డాగ్ హస్బెండ్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.