Rajdhani Files Movie : ‘రాజధాని ఫైల్స్’ మూవీ రిలీజ్ ఆపాలని వైసీపీ పిటిషన్
X
ఏపీలో సినిమా రాజకీయం రసవత్తరంగా మారింది. ఈమధ్యనే విడుదలైన యాత్ర2 సినిమా అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ నేతలకు కోపం తెప్పించింది. ఇకపోతే మరో రెండు రోజుల్లో రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' మూవీ విడుదల కానుంది. అయితే దీనికంటే ముందు టీడీపీకి సపోర్ట్‌గా ఓ పోలిటికల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజధాని ఫైల్స్ అనే పేరుతో ఏపీ రాజధాని కథాంశాన్ని భాను తెరకెక్కించారు. ఇందులో సీనియర్ నటుడు వినోద్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
ఒకప్పటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్ కూడా రాజధాని ఫైల్స్ మూవీలో నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ అన్ని పూర్తి చేసుకుని ఫిబ్రవరి 15వ తేదిన విడుదలవ్వడానికి సిద్దంగా ఉంది. అయితే రాజధాని ఫైల్స్ మూవీని ఆపాలంటూ
ఏపీ హైకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. వైసీపీ తరపున ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి పిటిషన్ వేశారు. సినిమా నిర్మాతలను, సెన్సార్ బోర్డును తన పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు.
రాజధాని ఫైల్స్ సినిమాలో సీఎం పాత్రపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ను అవమానించేలా రాజధాని ఫైల్స్ మూవీ తెరకెక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సెన్సార్ బోర్డు స్పందించింది. సినిమాను రెండుసార్లు చూసిన తర్వాతే సన్సార్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిపింది. ఆ మూవీలో ఎవరినీ అవమానించలేదని, అవన్నీ కల్పిత పాత్రలేనని న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలూ విన్న ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.