రిటైర్మెంట్ ప్రకటించిన మరో ఇంగ్లండ్ క్రికెటర్
X
ఇంగ్లండ్ ఆటగాళ్లు వరుసుగా రిటైర్మెంట్స్ ప్రకటిస్తున్నారు. తాజాగా మరో కీలక ఆటగాడు ఆంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. యాషెస్ సిరీస్-2023 సందర్భంగా స్టువార్ట్ బ్రాడ్, తర్వాత మొయిన్ అలీ,కొద్ది రోజుల గ్యాప్‌లో హేల్స్ ఆటకు దూరమవుతున్నట్లు ప్రకటించగా...తాజాగా ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ రిటైర్మెంట్ తెలిపాడు. గతేడాది నుంచి మోకాలి గాయంతో బాధపడుతున్న ఫిన్..తప్పని పరిస్థితుల్లో ఆట నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
‘గత 12 నెలలుగా నా శరీరంతో పోరాడుతున్నా. చివరకు అలసిపోయానని ఒప్పుకుంటున్నా. ఇన్నిరోజులు క్రికెట్ ఆడినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. 2005లో అరంగేట్రం చేశాను. అయితే… ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. అయినా కూడా వాటిని ఇష్టంగానే స్వీకరించా. ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 125 గేమ్‌లు ఆడాను. ఇంతకంటే ఎక్కువ ఇంకేం కోరుకోను’ అని ఫిన్ వెల్లడించాడు.
2005లో మిడిల్‌సెక్స్ తరఫున కెరీర్‌ను ప్రారంభించిన ఫిన్ 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేశాడు. 2017 వరకు ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తం ఇంగ్లండ్ తరఫున 36 టెస్టులు ఆడిన ఫిన్ 125 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. 69 వన్డేల్లో 102 వికెట్లు, 21 టీ20 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు సాధంచాడు. భారత్ పై ఓ వన్డేలో ఐదు వికెట్లను ఫిన్ సాధించాడు.