Home > క్రికెట్ > ఇదేం కెప్టెన్సీరా బాబోయో...! హార్దిక్‌పై తీవ్ర విమర్శలు

ఇదేం కెప్టెన్సీరా బాబోయో...! హార్దిక్‌పై తీవ్ర విమర్శలు

ఇదేం కెప్టెన్సీరా బాబోయో...! హార్దిక్‌పై తీవ్ర విమర్శలు
X

భారత్ విండీస్ టూర్ ముగిసింది. టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత్ జట్టు టీ20 సిరీస్‌ను చేజార్చుకుంది. ఐదు టీ20 సిరీస్‎లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లను ఓడి వెనుకంజ వేసిన భారత్..తర్వాత పుంజుకుని రెండు టీ20ల్లో విజయం సాధించింది. అయితే కీలకమైన టైటిల్ పోరులో హార్దిక్ సేన చతికిల పడింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిడిన వెస్టిండీస్ జట్టు ఫైనల్లో విజయం సాధించి.. సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విండీస్‌ చేతిలో ఓడిపోవడం భారత్‌కు ఇదే మొదటిసారి.





ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. కెప్టెన్సీతో పాటు, ఆటగాడిగా చెత్త ప్రదర్శనను మూటగట్టుకున్నాడు. 5 మ్యాచ్‌ల్లో మొత్తం 15 ఓవర్లు బౌలింగ్ చేసి 31 సగటుతో 126 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు కూడా 8 కంటే ఎక్కువగా ఉంది. బ్యాటింగ్ లోను ఇదే తరహా ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతడు 5 మ్యాచ్‌ల్లో 77 పరుగులు మాత్రమే చేశాడు.





టీ 20 మ్యాచ్‌ల్లో హార్దిక్ తీసుకున్న నిర్ణయాలు భారత్ కొంపముంచాయి. చివరి టీ20లో టాస్ గెలిచిన పాండ్య.. అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అంతేకాకుండా చివరి ఐదు ఓవర్లలో విండీస్ విజయానికి దాదాపు బంతికో పరుగు అవసరమైన సమయంలో పార్ట్ టైమ్ బౌలర్లకు హార్దిక్ బంతిని అందించడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. చాహల్ వేసిన 16 ఓవర్‌లో 12 పరుగులు, తిలక్ వర్మ వేసిన 17 ఓవర్‌లో 12 రన్స్, యశస్వి జైశ్వాల్ వేసిన 18వ ఓవర్‌లో 18 రన్స్ వచ్చాయి. ఈ దశలో అర్షదీప్ లాంటి బౌలర్లను దించి ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచాల్సింది పోయి.. స్పిన్నర్లతో, పార్ట్ టైమర్లతో బౌలింగ్ చేయించాడని విమర్శిస్తున్నారు. చివరి టీ20లో హార్దిక్ ప్రధాన బౌలర్లు ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ లకు ఒక ఓవర్ మాత్రమే ఇచ్చాడు. భవిష్యత్ కెప్టెన్‌గా హార్దిక్ ప్రవర్తన, తీసుకున్న నిర్ణయాలను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా ఐతే కష్టమేనని చురకలంటిస్తున్నారు.


Updated : 14 Aug 2023 10:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top