పృథ్వీ షా సంచలన నిర్ణయం !
X
రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న భారత్ ఆటగాళ్లలో యువ ఆటగాడు పృథ్వీ షా ఒకడు. తన టాలెంట్‌తో టీమిండియాలో ఎంత వేగం చోటు సంపాదించాడో..అంతే వేగంగా జట్టుకి దూరమయ్యాడు. ఫామ్ లేమి, వివాదాలు అతడి కెరీర్‌ను అంధకారంలోకి నెట్టేశాయి. తోటి ఆటగాళ్లు రోజురోజుకి మెరుగవుతున్న పృథ్వీ షా మాత్రం మరింత కిందకు పడిపోయాడు. ఐపీఎల్‌లో ఈ యంగ్ ఓపెనర్ ప్రదర్శనే దీనికి నిదర్శనం.
తిరిగి జట్టులోకి రావాలన్న ఆశ ఉన్న...అందుకోసం ప్రయత్నించే కసి మాత్రం పృథ్వీ షా ఆటలో కనిపించడం లేదు. దీంతో టీమిండియాలోకి దారులు దాదాపు మూసుకుపోయాయి. ప్రస్తుతం ఉన్న పోటీలో అతడు అసాధారణ ఆటతీరును ప్రదర్శించకపోతే జట్టులో ప్లేస్ కష్టమే. ఈ పరిణామాల నేపథ్యంలో పృథ్వీ షా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీదేశీ కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్తాంప్టన్‌షైర్ తరపున పృథ్వీషా ఆడనున్నట్లు ఓ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక తెలిపింది. దులీప్ ట్రోఫీ 2023 ముగిసాక షా నాలుగు రోజుల కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు, అనంతరం రాయల్ లండన్ వన్డే కప్ (50 ఓవర్ల టోర్నీ) ఆడతాడని వెల్లడించింది. ఈ వార్తలు నిజమైతే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పృథ్వీ షా ఆడడం ఇదే తొలిసారి.
23 ఏళ్ల పృథ్వీ షా చివరిగా 2021లో టీమిండియాకు ఆడాడు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు సెలెక్టర్లు ఇతన్ని ఎంపిక చేసినా.. తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ఐపీఎల్‌లో రాణించి టీమిండియా తలపు తట్టాలని భావించినా...అక్కడ కూడా దారుణంగా విఫలమయ్యాడు. పృథ్వీ షా తన కెరీర్‌లో 5 టెస్ట్‌లు, 6 వన్డేలు, ఓ టీ20 ఆడాడు.