WTC ఫైనల్..భారత్‌ను కలవరపెడుతున్న ఆ ముగ్గురి రికార్డులు
X
ఐపీఎల్ తర్వాత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు సమయం దగ్గరపడుతోంది. జూన్ 7-11 వరకు లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీం ఇండియా, ఆస్ట్రేలియా జట్టులు మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇరు జట్లు WTC టైటిల్ దక్కించుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే లండన్ చేరి ప్రాక్టీస్‌ను మొదలు పెట్టేశాయి. ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలో చెమటోడ్చుతున్నారు.
గత WTC టైటిల్‌ను చేజార్చుకున్న టీం ఇండియా ఈ సారి విజయం సాధించాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఇక ఓవల్ మైదానంలో భారత్ ట్రాక్ రికార్డులు, ప్లేయర్స్ వ్యక్తిగత ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం.
కోహ్లి కాదు..రోహిత్ టాప్
ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు చెత్త రికార్డులు కలిగి ఉన్నాయి. ఆసీస్ ఆడిన 38 మ్యాచ్‌ల్లో ఏడింటిలో విజయం సాధించగా.. భారత జట్టు ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే మాత్రమే గెలుపొందింది. ఇక ఈ మైదానంలో విరాట్ కోహ్లీ కంటే కెప్టెన్ రోహిత్ శర్మకు మంచి రికార్డు ఉంది. ఓవల్ మైదానంలో రోహిత్ శర్మ ఒకే ఒక్క మ్యాచ్ ఆడి 127 పరుగులు చేశాడు. 2021 పర్యటనలో రోహిత్ సెంచరీతో రాణించాడు.
కోహ్లి, రహానే, పుజారాలకు చెత్త రికార్డు
WTC ఫైనల్‌కి ముందు భారత్‌ను కోహ్లి, రహానే, పుజారాలకు చెత్త రికార్డు కలవరపెడుతోంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇక్కడ ఆడిన మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశపరిచారు. విరాట్ కోహ్లి ఆడిన 3 మ్యాచ్‌ల్లో 28.16 సగటుతో కేవలం 169 పరుగులు మాత్రమే చేయగా.. పుజారా ఓవల్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 19.50 సగటున 117 పరుగులు, రహానే 3 మ్యాచ్‌ల్లో 9.16 సగటున 55 పరుగులు చేశారు. రవీంద్ర జడేజాకు మాత్రం ఓవల్ లో మెరుగైన రికార్డు ఉండడం శుభపరిణామం. జడేజా ఇక్కడ 2 మ్యాచ్‌ల్లో 42 సగటున 126 పరుగులు చేసి 11 వికెట్లు తీశాడు.