Home > క్రైమ్ > 14 ఏళ్లకే గుండెపోటు..9వ తరగతి విద్యార్థి మృతి

14 ఏళ్లకే గుండెపోటు..9వ తరగతి విద్యార్థి మృతి

14 ఏళ్లకే గుండెపోటు..9వ తరగతి విద్యార్థి మృతి
X

ఒకప్పుడు గుండెపోటు వయసుమీరిన వారికి లేదా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రమే వచ్చేవి. కానీ, నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా పసిమొగ్గలను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. చిన్న పిల్లల జీవితాలను పసి మొగ్గలుగా ఉన్నప్పుడే చిదిమేస్తోంది. మొన్నటికి మొన్న ఓ చిన్నారి బడికి సెలవు ఇవ్వడంతో స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుని, తన బామ్మ పక్కనే పడుకుంది. తెల్లారేసరికి గుండెలో నొప్పితో విలవిల్లాడింది. పాపను హాస్పిటల్‎కు తీసుకెళ్లేలోపే తన తుది శ్వాసను విడిచింది. ఆ తరువాత పల్నాడుకు చెందిన ఓ 13 ఏళ్ల బాబు గుండెపోటుతో చనిపోయాడు. ఈ రెండు సంఘటనలే కాదు ఇలాంటి సంఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. ముక్కుపచ్చలారని పిల్లలను సైతం మాయదారి గుండె పోటు బలితీసుకుంటోంది. తాజాగా మరో బాలుడు గుండెలో నొప్పితో బాధపడుతూ తుదిశ్వాసవిడిచాడు.

ఈ షాకింగ్ సంఘటన ఖమ్మం నగరంలో జరిగింది. ఎన్ఎస్‌పీ కాలనీకి చెందిన 14 ఏళ్ల బాలుడు మాదాసి రాజేశ్ చిన్న వయస్సులోనే కన్నుమూశాడు. గుండెపోటుతో మృతి చెందాడు. రాజేశ్ స్థానికంగా ఉన్న గవర్నమెంట్ స్కూల్‎లో 9వ క్లాస్ చదువుతున్నాడు. ఎప్పటిలాగే ఈ రోజు ఉదయం రాజేశ్‌ స్కూల్‎కి వెళ్లాడు. బడికి వెళ్లిన కొద్దిసేపటికే రాజేశ్‎కు ఛాతిలో విపరీతమైన నొప్పి రావడంతో ఒక్కసారిగా స్కూల్‎లో కుప్పకూలిపోయాడు. రాజేశ్ పరిస్థితిని గుర్తించిన టీచర్లు వెంటనే బాలుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ సంఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కుమారుడు ఇక లేడన్న వార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రాజేశ్‎కు గతంలో ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు.


Updated : 17 Aug 2023 5:09 PM IST
Tags:    
Next Story
Share it
Top