పిల్లల అక్రమ రవాణాలో ఏపీ నంబర్ త్రీ..
X
ఏపీ నుంచి మానవ అక్రమ రవాణా భారీ స్థాయిలో సాగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 26 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుంది. యువతులు, మహిళలనే కాకుండా అన్యంపుణ్యం ఎరుగని పసిపిల్లలను కూడా కొందరు స్వార్థపరులు భారీ సంఖ్యలో రాష్ట్రం నుంచి దాటిస్తున్నట్లు వెల్లడైంది. బాలల అక్రమ రవాణాలో ఏపీ దేశంలో మూడో స్థానంలో నిలించింది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ తర్వాత ఏపీ నుంచే చైల్డ్ ట్రాఫికింగ్ ఎక్కువగా సాగుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. అక్రమంగా ఎత్తుకెళ్లిన పిల్లలను అత్యధికంగా ప్రమాదకరమైన ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో నియమించుకుంటున్నారు.
బాలల అక్రమ రవాణాపై గేమ్స్24X7 అనే ఎన్జీవో, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి సొంత సంస్థ కేఎస్‌సీఎఫ్ కలసి దేశంలో బాలల అక్రమ రవాణాపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించాయి. అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఆదివారం దాన్ని విడుదల చేశాయి. 21 రాష్ట్రాల్లోని 262 జిల్లాలకు సంబంధించి 2016 నుంచి 2022 వరకు దొరికిన డేటా ఇందులో ఉంది. బిహార్, యూపీ, ఏపీ పిల్లల అక్రమరవాణాలో సింహభాగాన్ని జత చేశాయి. ఏపీలోని గుంటూరు జిల్లా దేశంలోనే ఆరో స్థానంలో నిలిచింది. ఏపీలో మొత్తం 734 కేసులకు గాను గుంటూరులో అత్యధికంగా 208 కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో 125, శ్రీకాకుళం 98 మంది చిన్నారు కనిపించకుండా పోయారు. దేశంలో జైపుర్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. బిహార్‌లో 4245 మంది, యూపీలో 3836 మంది పిల్లలను నేరస్తులు సరిహద్దు దాటించారు.