Home > క్రైమ్ > డీబార్‌ చేశారన్న కోపంతో.. ప్రిన్సిపల్‌పై బ్లేడుతో దాడి

డీబార్‌ చేశారన్న కోపంతో.. ప్రిన్సిపల్‌పై బ్లేడుతో దాడి

ఇంటర్ విద్యార్థి ఘాతుకం

డీబార్‌ చేశారన్న కోపంతో.. ప్రిన్సిపల్‌పై బ్లేడుతో దాడి
X

ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. డీబార్‌ చేశారన్న కోపంతో ఓ విద్యార్థి కాలేజీ ప్రిన్సిపల్‌పై బ్లేడుతో దాడి చేశాడు. గొంతు కోసేందుకు కూడా ప్రయత్నించాడు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ప్రిన్సిపాల్ దాడికి గురయ్యారు. గిద్దలూరు చిన్నమసీదు వీధిలో నివాసం ఉంటున్న గొంట్ల గణేష్‌ అనే విద్యార్థి.. స్థానిక సాహితి జూనియర్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గత ఏడాది ఇంటర్‌ పరీక్షలు రాస్తూ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో స్క్వాడ్‌ అతన్ని డీబార్‌ చేసింది. దీంతో అప్పటి నుంచి ఆ కాలేజీ ప్రిన్సిపల్‌ మూల కొండారెడ్డిపై గణేష్‌ కక్ష పెంచుకున్నాడు.

అతనిపై దాడి చేసేందుకు ప్లాన్ వేశాడు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ప్రిన్సిపల్‌ కొండారెడ్డి స్థానిక గాంధీ బొమ్మ సర్కిల్ వద్ద ఉండగా గణేష్‌ అతనిపై దాడిచేసి బ్లేడుతో మెడపై కోయగా, చేతిని అడ్డు పెట్టడంతో చేతికి కూడా గాయమైంది. స్థానికులు అడ్డు వెళ్లగా తన ఇంటి వద్ద గొడ్డలి ఉందని, తనను పట్టుకుంటే దాంతో దాడి చేస్తానని హెచ్చరించాడు. స్థానికులు కొండారెడ్డిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న గిద్దలూరు సీఐ దేవప్రభాకర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కొండారెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గిద్దలూరు ఎస్‌ఐ వి.మహేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




Updated : 30 Jun 2023 10:16 AM IST
Tags:    
Next Story
Share it
Top