మరో హానిట్రాప్ కేసు..పాక్ మహిళకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన బీఎస్ఎఫ్ ఉద్యోగి
X
దాయాది దేశం పాకిస్థాన్.. మన దేశ రహస్యాలను రాబట్టడానికి హనీ ట్రాప్ ని అస్త్రంగా ఉపయోగిస్తోంది. ఇప్పటికే డీఆర్డీఓలో పనిచేస్తున్న ఓ సైంటిస్టు సున్నితమైన భారత మిస్సైల్ రహస్యాలను ఓ పాకిస్తాన్ మహిళా ఏజెంట్ తో పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హనీట్రాప్ కేసు వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. గుజరాత్ లోని భుజ్ లో బీఎస్ఎఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ గా పనిచేస్తున్న వ్యక్తి పాక్ మహిళ వలపు వలలో చిక్కుకున్నాడు. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ ఆమెతో చాలా సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసుకున్నాడు. ఇలా చేసినందుకు ఆ మహిళ.. సదరు ఉద్యోగికి డబ్బు కూడా పంపింది. అతని కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు.. శుక్రవారం అరెస్ట్ చేసి విచారించగా షాకింగ్ నిజాలు తెలిశాయి.
నిందితుడు నీలేష్.. గత 5 ఏళ్ళుగా భుజ్ లోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్ కార్యాలయంలో ప్యూన్ గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి కొన్ని నెలల క్రితం అదితి తివారీ అనే పేరుతో పాక్ కు చెందిన ఏజెంట్ పరిచయమైంది. వాట్సాప్ ద్వారా నీలేష్ తో పరిచయం పెంచుకున్న ఆమె ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా నటిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెతో తాను పనిచేస్తున్న కంపెనీ గురించి, నిర్మాణంలో ఉన్న బీఎస్ఎఫ్ భవనాల్లో విద్యుదీకరణ పనులకు సంబంధించి సున్నిత సమాచారాన్ని, అదే విధంగా సివిల్ డిపార్ట్ మెంట్ పత్రాలను వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. ఆ ఇన్ఫర్మేషన్ ను షేర్ చేసినందుక ఆ మహిళ నీలేష్ కు యూపీఐ ద్వారా రూ.28 వేలు పంపింది. అయితే అతడి కదలికలపై అనుమానం రావడంతో అతడి ఫోన్ రికార్డులు, వాట్సాప్ హిస్టరీ, బ్యాంక్ ఖాతాలను అధికారులు పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అతడిపై నేరపూరిత కుట్ర, అధికారిక రహస్యాల చట్టం కింద ఐపీసీ సెక్షన్ 121, సెక్షన్ 120 బి కింద కేసులు నమోదు చేశారు. గుజరాత్ ఏటీఎస్ నీలేష్ ను శుక్రవారం అరెస్ట్ చేసింది.