కానిస్టేబుల్ కాదు కేటుగాడు..ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ..
X
దేశానికి సేవ చేయాల్సిన వృత్తిలో ఉండి దొంగతనాల రుచి మరిగాడు ఓ సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్. అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురాశతో అడ్డదారులు తొక్కాడు. చేస్తున్న ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ఇళ్లకు కన్నాలేయడం అలవాటు చేసుకున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు గుట్టుచప్పుడు కాకుండా ఏకంగా 12 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. బంగారం, వెండి ఆభరణాలే టార్గెట్..ఇళ్లకు కన్నాలేసి విలువైన వస్తువులను కాజేసేవాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి ఇప్పుడు ఊచుల లెక్కబెడుతున్నాడు.
విజయనగరానికి చెందిన కె.శ్రీనివాసరావు ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. తన విధులకు సెలవు పెట్టి గతేడాది ఆగస్టులో విజయనగరం వచ్చాడు. ఆ తర్వాత ఉడాకాలనీలో ఓ ఇల్లు రెంటుకు తీసుకున్నాడు. ఇదే సమయంలో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లకు రుచి మరిగాడు. దీంతో లక్షల రూపాయలు అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చకోవడంతో ఉద్యోగానికి తిరిగి వెళ్లలేదు. అప్పులు తీర్చేందుకు దొంగగా మారాలనుకున్నాడు. అందుకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా.. పగటి వేళ రెక్కీ నిర్వహించేవాడు. అర్థరాత్రి 12 గంటలకు ఇళ్లను దోచేసేవాడు. అలా ఇప్పటి వరకు 12 చోట్ల దొంగతనాలు చేశాడు శ్రీనివాసరావు. ఉడాకాలనీలోని ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3, అలకానంద కాలనీ, రింగురోడ్డు, బాబామెట్ట ఇలా పలు ప్రాంతాల్లో బంగారం, వెండి ఆభరణాలు వస్తువులను దోచుకెళ్లాడు.
వరుస దొంగతనాలు జరుగుతుండడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఆదివారం వాహనాలు తనిఖీలు జరుగుతున్న సమయంలో శ్రీనివాసరావు ఓ బ్యాగ్‌తో అనుమానాస్పదంగా కనిపించాడు.దీంతో పోలీసులు అతడిని పట్టుకుని తనిఖీ చేయగా.. ఆ బ్యాగులో తాళాలు, స్క్రూడ్రైవర్ వంటి పరికరాలు ఉండటంతో ఆరా తీశారు. దీంతో శ్రీనివాసరావు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి 27 తులాల బంగారం, ఆరు కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.