Ritu Sahu : ఇంటర్ స్టూడెంట్ సూసైడ్.. ఏపీ పోలీసులపై బెంగాల్ సీఎంకు ఫిర్యాదు
X
విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రీతి సాహ కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది. జులై 14వ తేదీన భవనంపై నుంచి కిందపడి రీతి సాహ ప్రాణాలు కోల్పోయింది. నీట్ శిక్షణ కోసం కోల్‌కత్తా నుంచి విశాఖ వచ్చి చదువుకుంటున్న రీతి సాహా వ్యవహారం ఇప్పుడు మిస్టరీగా మారింది. అయితే, కేసు దర్యాప్తును స్థానిక పోలీసులు తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ విద్యార్ధిని తల్లిదండ్రులు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్యార్దిని ఆత్మహత్య వ్యవహారంలో ఏపీ పోలీసుల వైఖరిపై బాలిక తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడం, బెంగాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో కేసు సంచలనంగా మారింది..
ఇక, రీతి సాహ కేసులో తాజాగా కొత్తట్విస్ట్ తెరపైకి వచ్చింది. విద్యార్థిని రీతి సాహ ఆసుపత్రిలో ఉన్న వీడియో బయటపడింది. హాస్టల్ బిల్డింగ్ నుంచి కిందపడిన తర్వాత బాలికను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చింది యాజమాన్యం. దీంతో బాలిక తల్లిదండ్రుల ఆరోపణలకు రోజు రోజుకి బలం చేకూరినట్టు అవుతుంది. రీతి సాహా అత్మహత్య కేసులో బెంగాల్ ప్రభుత్వం ఒత్తిడితో దర్యాప్తు అధికారులపై ఇప్పటికే వేటు పడింది. సీఐ, ఎస్సైలను ఏపీ ప్రభుత్వం వీఆర్‌కు పంపింది. మరోవైపు.. రీతి సాహ కేసుపై ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఆమె తండ్రి సుఖ దేవ్.. సీసీ టీవీ ఫుటేజ్ సేకరణ కోసం ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో రీతి సాహ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. సీఐడి పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో అరెస్టుల పర్వం మొదలయింది. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురి పోలీసులు అరెస్ట్ చేశారు. సాధన హాస్టల్ కు చెందిన ఇద్దరు, బైజుస్ యాజమాన్యంకి చెందిన ఇద్దరు అరెస్ట్ అయ్యారు. సాధన హాస్టల్ ఓనర్ లక్ష్మీ, వార్డెన్ కుమారి.. ఆకాష్ బైజూస్ కాలేజీ మేనేజర్ సూర్యకాంత్, అసిస్టెంట్ మేనేజర్ రామేశ్వర్ ను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగానే రీతి సాహ చనిపోయినట్టు విశాఖ పోలీసులు నిర్ధారించారు. హాస్టల్ బిల్డింగ్ నుంచి కిందపడిన తర్వాత బాలికను సమీపంలో ఉన్న వెంకటరామ ఆసుపత్రిలో చేర్చింది యాజమాన్యం. ఈ ప్రకారంగా వెంకటరామ, కేర్ హాస్పిటల్ లలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతుంది. వీరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గత నాలుగు రోజుల నుంచి విశాఖలోనే సీఐడి, బెంగాల్ పోలీసులు మకాం వేశారు.