ప్రియుడిపై పగబట్టిన ప్రియురాలు.. కోపంలో ఏం చేసిందంటే..
X
మద్యం మత్తులో ప్రియుడు తిట్టాడన్న కోపంతో ప్రియురాలు అతని ప్రాణాలు తీసింది. పగబట్టిన ప్రియురాలు పాముతో కాటు వేయించి ప్రియుడిని చంపించింది. తొలుత అందరూ ప్రమాదం అని భావించినా పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.
కారులో డెడ్ బాడీ
హల్ద్వానీ ప్రాంతానికి చెందిన అంకిత్ చౌహాన్ బిజినెస్ మేన్. అతనికి మహీ ఆర్య అనే ప్రియురాలు ఉంది. ఈ నెల 15న అంకిత్ కారు తీన్ పానీ ప్రాంతంలో రోడ్డుపక్కన ఆగి ఉంది. చాలాసేపు ఇంజిన్ రన్నింగ్ లోనే ఉండటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా అందులో అంకిత్ మృతదేహం లభ్యమైంది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అంకిత్ పాము కాటుతో చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. డాక్టర్లు అతని శరీరంపై రెండు చోట్ల పాముకాట్లు గుర్తించారు.
అంకిత్ సోదరి ఫిర్యాదు
అంకిత్ మృతిపై అనుమానంతో అతని సోదరి ఈశా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన సోదరుడి మరణానికి అతని ప్రియురాలు ఆర్య, ఆమె స్నేహితురాలు దీప్ కందపాల్‌లు కారణమని ఆరోపించింది. ఘటన జరిగిన తీరు సైతం అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంకిత్ కాల్ డేటాను పరిశీలించగా ఆర్య నంబర్‌కు ఎక్కువగా కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. ఆమె కాల్ డేటా పరిశీలిస్తే ఉత్తర్‌ప్రదేశ్‌లో పాములు ఆడించే రమేశ్ నాథ్‌కు ఆమె ఫోన్లు చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు సోమవారం అతణ్ని అరెస్టు చేయగా అసలు విషయం బయటపడింది.
విచారణలో వెల్లడైన నిజం
పోలీసుల విచారణలో రమేష్ అసలు విషయం చెప్పారు. ఆర్య, ఆమె స్నేహితురాళ్లు కలిసి అంకిత్‌ను చంపేందుకు పామును వినియోగించారని ఒప్పుకొన్నాడు. ఈ నెల 14న తప్పతాగి ఆర్య ఇంటికి వెళ్లిన అంకిత్ ఆమెను తిట్టడంతో పగ పెంచుకుందని.. పాము కాటుతో చంపాలని పథకం వేసిందని చెప్పాడు. దాంతో పోలీసులు రమేశ్ నాథ్ సహా ఆర్య, దీప్ కందపాల్, మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
Girlfriend Used Cobra To Kill boy friend in Uttarakhand