శామీర్పేట్లో కాల్పుల కలకలం.. వ్యక్తిపై కార్తీక దీపం నటుడి ఫైరింగ్
X
హైదరాబాద్లో కాల్పుల కలకలం రేగింది. శామీర్‌పేట్ సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కలకలం రేగింది. ఓ యువకుడిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు శామీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కాల్పులకు వివాహేతర సంబంధమే కారణమని సమాచారం.
నగరానికి చెందిన సిద్ధార్థ్ దాస్ ఆయన భార్య స్మిత మధ్య ౨౦౧౯ నుంచి విడాకుల కేసు నడుస్తోంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్మిత శామీర్‌పేట్‌లోని సెలబ్రిటీ క్లబ్ లోని ఓ విల్లాలో ఉంటోంది. కార్తీక దీపం సీరియల్లో నటిస్తున్న మనోజ్ కుమార్‌తో సహజీవనం చేస్తోంది. కోర్టు ఉత్తర్వుల మేరకు సిద్ధార్ధ తన పిల్లలను చూసేందుకు ఇవాళ విల్లా దగ్గరకు ఈ క్రమంలో స్మితతో గొడవపడ్డాడు. దీంతో అక్కడే ఉన్న మనోజ్ కుమార్ ఆగ్రహానికి గురై ఎయిర్‌గన్‌తో సిద్ధార్థ్పై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన సిద్ధార్ధ అక్కడి నుంచి తప్పించుకుని శామీర్‌పేట్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు.
ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూతురు, కొడుకు ఇద్దరు భార్యతోనే ఉండడంతో.. బిడ్డల్ని చూసేందుకు సిద్ధార్థ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ ఆశ్రయించాడు. ఇదే క్రమంలోనే అక్కను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొడుకు సిద్ధార్థ్‌కు చెప్పాడు. దీంతో కూతురును చూసేందుకు వెంటనే సెలబ్రిటీ క్లబ్‌లోని రిసార్ట్ విల్లాకు రాగా మనోజ్ సిద్ధార్థ్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం.