వీడు మామూలోడు కాదు..నిత్య పెళ్లికొడుకు..ఏకంగా 15 మంది అమ్మాయిలకు టోపీ
X
ఈ రోజుల్లో అన్నీ ఉండి కూడా ఒక్క పెళ్లి చేసుకోవాలంటేనే కుర్రాళ్లు కంగారుపడిపోతున్నారు. అలాంటిది బెంగళూరుకు చెందిన ఓ యువకుడు మాత్రం ఏకంగా 15 పెళ్లిళ్లు చేసుకుని పెళ్లాలకు టోపీ పెట్టాడు. డాక్టర్ అంటూ నమ్మబలికి యువతులను ట్రాప్‌లోకి దించి తన ప్రేమలో పడేలా చేసి, ఆపైన పెళ్లి చేసుకుని వారి దగ్గర ఉన్నదంతా దోచుకుని గత కొన్నేళ్లుగా మహిళలను వంచిస్తున్నాడు మహేష్ అనే వ్యక్తి. తాజాగా మైసూరుకు చెందిన మహిళ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ యువకుడి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఈ కేసు సంచలనంగా మారింది.
మైసూరుకు చెందిన హేమలతని మహేష్ షాదీ డాట్ కామ్ వెబ్‍సైట్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న విజయనగరలోనే తాను ఉంటున్నట్లు హేమలతను నమ్మించాడు. జనవరిలో విశాఖలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం మైసూరుకు వచ్చి కాపురం పెట్టారు. అయితే ఓ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నా పెట్టుబడిగా రూ.70 లక్షలు కావాలని మేమలతను అడిగాడు. అయితే అందుకు ఆమె నిరాకరించడంతో చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలోనూ చడీచప్పుడు కాకుండా బీరువాలో ఉన్న రూ.15 లక్షలతో పాటు విలువైన బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యాడు. భర్త తిరిగి వస్తాడని అనుకున్న ఆమెను దివ్య అనే మరో మహిళ కలిసింది. మహేశ్ తనను కూడా పెళ్లి చేసుకుని మోసం చేశాడని వివరించడంతో వెంటనే వారిద్దరే కువెంపునగర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారు. నిందితుడ్ని వెంటనే పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు.
మహేష్ దగ్గరి నుంచి పోలీసులు రూ.2 లక్షల క్యాష్,2 కార్లు, 7 ఫోన్లు, బంగారు ఆభరణాలను జప్తు చేసుకున్నారు.
విచారణలో నిందితుడు ఇదే విధంగా 15 మందికి పైగా మహిళలను మోసం చేశాడని పోలీసులు తెలిపారు. తమ పిల్లల పెళ్లిళ్ల కోసం సామాజిక మాధ్యమాలు, మాట్రిమోని వెబ్‌సైట్లను ఆశ్రయించే వారు ముందుగా పూర్వాపరాలను విచారించాకే ముందుకు వెళ్లాలని పోలీసులు సూచించారు.