ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా
X
సెల్ఫీలు, వీడియోల కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదం అని తెలిసినా లెక్క చేయకుండా ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నిస్తూ మృత్యువాత పడుతున్నారు. రాజన్న సిరిసిల్లకు చెందిన ప్రవీణ్ అనే పీజీ విద్యార్ధి ఇలాగే తన చేతులారా తన చావును తానే కొనితెచ్చుకున్నాడు.
సిరిసిల్లకు చెందిన ప్రవీణ్ రిమ్స్ లో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి ఆదిలాబాద్ లోని శివఘాట్ కు వెళ్ళాడు. పక్కనే ఉన్న సాత్నాల వాగు దగ్గర కోటిలింగాలను దర్శించుకున్నారు. తర్వాత అక్కడే ఫోటోలు తీసుకుందామని ప్రయత్నిస్తుండగా ఫోన్ వాగులో పడిపోయింది. దాన్ని తీసుకునేందుకు వాగులో దిగిన ప్రవీణ్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
ప్రవీణ్ ను కాపాడేందుకు అతని ఫ్రెండ్స్ ఇద్దరు ప్రయత్నించారు. కానీ నీళ్ళల్లో ఉక్కిరిబిక్కిరి కావడంతో వెంటనే బయటకు వచ్చేశారు. పోటీసులకు సమాచారం అందించగా, గజ ఈతగాళ్ల సాయంతో ప్రవీణ్ కోసం గాలించగా.. చివరకు ప్రవీణ్ మృతదేహం దొరికింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనాస్థలానికి చేరుకుని విగత జీవిగా మారిన కొడుకును చూసి కన్నీరుమున్నీరయ్యారు. బాగా చదువుకుని కుటుంబాన్ని చూసుకుంటాడనుకున్న కొడుకు శవమై కనిపించడంతో అతని తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ప్రవీణ్ ను కాపాడేందుకు ప్రయత్నించిన స్నేహితుల్లో ఒకరు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో అతన్ని వెంటనే రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రవీణ్ తప్ప మిగతా అందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు చెప్పారు.