Home > క్రైమ్ > మార్చురీలో కుళ్లిన శవం.. ప్రైవేట్ హాస్పిటల్‌కు భారీ జరిమానా

మార్చురీలో కుళ్లిన శవం.. ప్రైవేట్ హాస్పిటల్‌కు భారీ జరిమానా

మార్చురీలో కుళ్లిన శవం.. ప్రైవేట్ హాస్పిటల్‌కు భారీ జరిమానా
X

ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఆరోగ్యం విషమించి చనిపోగా.. పరిస్థితులు అనుకూలించక అతని మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచారు కుటుంబసభ్యులు. అయితే శవాన్ని భద్రపరిచే రిఫ్రిజిరేటర్ పనిచేయకపోవడంతో.. అతని మృతదేహం కుళ్లిపోయింది. ఇందుకు ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమని.. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్. సకాలంలో పరిహారం చెల్లించకుంటే ఈ మొత్తానికి అదనంగా 8 శాతం వడ్డీ కలిపి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది.మంగళూరు డేరాలకట్టెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.

నాలుగేళ్ల క్రితం డేరాలకట్టే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. విల్సన్ అలాన్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తి 2019 అక్టోబర్ 25న మరణించగా.. మృతదేహాన్ని హాస్పిటల్ మార్చురీలో ఉంచారు మృతుడి కుటుంబీకులు. ఇందుకోసం ఆసుపత్రికి రూ.2,250 చెల్లించారు. రెండ్రోజుల తర్వాత అంటే 2019 అక్టోబర్ 27న రిఫ్రిజిరేటర్ చెడిపోయిందని, మృతదేహాన్ని తీసుకెళ్లమని సిబ్బంది మృతుడి సోదరుడు నెల్సన్‌కు ఫోన్‌ చేశారు. నెల్సన్ అక్కడకు వెళ్లి మృతదేహాన్ని చూసేటప్పటికే శవం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఇదేంటని సిబ్బందిని ప్రశ్నించగా.. మృతదేహాన్ని ఉంచిన రిఫ్రిజిరేటర్‌ చెడిపోయిందని, అందువల్లే ఇలా జరిగిందని శవం కబురు శాంతంగా చెప్పారు. దీంతో నెల్సన్‌కు ఒళ్లు మండిపోయి.. ఆస్పత్రి సిబ్బందిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి నిర్లక్ష్యమే మృతదేహం కుళ్లిపోవడానికి కారణమని నెల్సన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అలాగే మృతదేహం కుళ్లిపోవడం వల్ల నివాళులర్పించడం కూడా సాధ్యపడలేదని మృతుడి కుటుంబీకులు వాదించారు. మరోవైపు ఆస్పత్రి వర్గాలు అనుకోకుండా రిఫ్రిజిరేటర్ చెడిపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందంటూ చెప్పాయి. నోటీసు ఇచ్చిన వెంటనే సంబంధిత వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్లినట్లయితే, అది కుళ్లిపోయేది కాదని పోలీసుల ముందు వాదించాయి. ఇక లాభం లేదనుకొని మృతుడి కుటుంబ సభ్యులు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కమిషన్‌ విచారణలో ఆసుపత్రి నిర్లక్ష్యం, సేవా వైఫల్యం వల్లే మృతదేహం కుళ్లిపోయిందని నిర్ధరణ అయింది. దీంతో కమిషన్ మృతుల బంధువులకు హాస్పిటల్ మేనేజ్మెంట్ రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

Updated : 24 Nov 2023 9:01 AM IST
Tags:    
Next Story
Share it
Top