పక్కింటిపై 2 కోట్ల నగదు విసిరేసిన అవినీతి అధికారి
X
ఐటీ దాడుల్లో అవినీతి సొమ్ము బయటపడకుండా ఓ సబ్ కలెక్టర్ రూ. 2 కోట్ల నగదును పక్కింటిపై విసిరేశాడు. పక్కింటోళ్లకు అదృష్టం లేక ఆ డబ్బు కాస్తా ఐటీ అధికారుల హస్తగతమైంది. ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లా సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రౌత్ బాగోతమిది. రౌత్ అక్రమార్కులతో జట్టుకట్టి కోట్ల కొద్దీ డబ్బు సంపాదించాడని ఉప్పందడంతో ఆదాయపన్నుఆధికారులు, రాష్ట్ర విజిలెన్స్ అధికారులు శుక్రవారం వేకువజామున అతని ఇంటితోపాటు బంధువుల ఇళ్లపై దాడి చేశారు. భువనేశ్వర్‌లోని రౌత్ ఇంట్లో సోదాకు వెళ్లగా అతడు హడావుడిగా 2 కోట్లకుపైగా నగదును ఆరు పెట్టెల్లో సర్ది పక్కింటి టెరస్‌పై విసిరేశాడు. విషయం తెలుసుకున్న అధికారులు ఆ డబ్బాలను తిరిగి తీసుకొచ్చి లెక్కబెట్టారు.
రౌత్ వ్యవహారంపై ఐటీ అధికారులకు మొదటి నుంచీ అనుమానాలు ఉన్నాయి. ఐదేళ్ల కిందట సుందర్‌గఢ్ జిల్లాలో బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు లంచాలు తీసుకుని అరెస్టయ్యాడు. తర్వాత మైనింగ్ మాఫియాకు సహకరిస్తూ భారీ స్థాయిలో కూడబెట్టాడు. అతడు ఇటీవల భారీ మొత్తంలో రూ. 2వేల నోట్లను బ్యాంకులో ఇచ్చి రూ. 500 నోట్లను తీసుకున్నాడు. అతని లావాదేవీలపై ఆరా తీసిన ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. రౌత్ ఇంట్లో 2.25 కోట్ల నగదు, నబరంగ్‌పుర్‌లోని బంధువుల ఇంట్లో రూ.77 లక్షలు దొరికాయి.