డ్యూటీలో బిజీగా ఉంటోందని మహిళా కానిస్టేబుల్‌ను చంపిన భర్త
X
భర్త బరువు బాధ్యతల్లో పాలు పంచుకునేందుకు ఉద్యోగంలో చేరిన మహిళను ఆ భర్తే అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఉద్యోగం చేస్తున్న భార్య ఇంట్లో ఎక్కువ సమయం ఉండటం లేదన్న కోపంతో భర్త ఆమెను దారుణంగా కాల్చి చంపాడు. తనతో ఎక్కువ సమయం గడపటం లేదని ఆగ్రహంతో ఆమెను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
పాట్నాలోని జెహనాబాద్ కు చెందిన గజేంద్ర యాదవ్ తన భార్య శోభాకుమారి (23)తో కలిసి జీవిస్తుండేవారు. వారిద్దరూ ఆరు సంవత్సరాల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కొంత కాలం కిందట ఓ కూతురు జన్మించింది. గజేంద్ర యాదవ్ స్థానికంగా ఓ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుండగా.. అతడి భార్యకు ఈ మధ్యే పోలీసు కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన నాటి నుంచి ఆమె బిజీగా మారింది. విధి నిర్వహణలో భాగంగా శోభాకుమారి ఇంట్లో కంటే బయటే ఎక్కువగా ఉండేవారు. అయితే ఈ విషయం భర్తకు నచ్చలేదు. దీని వల్ల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. విసుగు చెందిన గజేంద్ర యాదవ్ తన భార్యను అంతం చేయలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే ఇటీవలో స్థానికంగా ఉన్న ఓ హోటల్ లో రూమ్ బుక్ చేశాడు.
అనంతరం భార్యకు కాల్ చేసి హోటల్ రూమ్ కు రావాలని ఆహ్మానించాడు. ఈ క్రమంలో అక్కడా ఇద్దరి మధ్య గొడవల జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన గజేంద్ర యాదవ్.. తన భార్యను తుపాకితో కాల్చి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.