Hyderabad: కీచక టీచర్.. 8వ క్లాస్ విద్యార్థినిపై..
X
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లోని ఎస్ఆర్ డీజీ స్కూల్లోని పీఈటీ టీచర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. 8 తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పీఈటీ టీజర్ విష్ణు గత కొంత కాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ.. విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. ఇంతకాలం టీచర్ కు భయపడి ఎవ్వరికీ చెప్పలేదని తెలిపింది. ఈమధ్య అతని వేధింపులు ఎక్కువ కావడంతో వాటిని భరించని విద్యార్థిని పేరేంట్స్ కు కంప్లైంట్ చేసింది. పీఈటీ టీచర్ విష్ణు.. ప్రతిరోజూ విద్యార్థినితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెట్టేవాడని తెలిపింది.
దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, విద్యార్థిసంఘాల నాయకులు.. స్కూల్ పై దాడికి దిగారు. ఫర్నీచర్ కంప్యూటర్లన్నీ ద్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పీఈటీ టీచర్ ఫోన్ స్విచాఫ్ చేసి పారిపోయాడు. తల్లిదండ్రులు నిలదీస్తారని స్కూల్ ప్రిన్సిపల్ కూడా ఫోన్ స్విచాఫ్ పెట్టుకున్నాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. స్కూళ్లో విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుందని, ఫీజులపై పెట్టే దృష్టి విద్యార్థుల రక్షణలో లేదంటూ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలిసిన వాళ్ల ద్వారా పీఈటీ ఆచూకి తెలుసుకున్న బంధువులు.. అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.