Manipur violence: మణిపూర్ లో మరో ఘోరం.. మిస్సైన విద్యార్థుల హత్య
X
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య ఘర్షణలతో నాలుగు నెలలుగా అట్టుడుకుతూనే ఈ రాష్ట్రంలో.. తాజాగా మరో ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారనే వార్త కలకలం రేపుతోంది. వీరి మృతదేహాల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూలైలో కనిపించకుండాపోయిన ఈ ఇద్దరు విద్యార్థులు అల్లరిమూకల స్వాధీనంలో ఉన్న ఫోటోలే కాకుండా.. అత్యంత దారుణంగా హత్యకు గురైన ఫోటో కూడా నెట్టింట్లో సంచలనంగా మారింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా మరో దుమారాన్ని రేపింది.
అసలేం జరిగిందంటే.. మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు 17 ఏళ్ల హిజామ్ లిన్‌తోఇంగంబి, 20 ఏళ్ల ఫిజామ్ హేమ్‌జిత్ జూలై నుంచి కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో తాజాగా వారు అడవిలోని గడ్డి మైదానంలో కూర్చుని, వారి వెనకాల కొంచెం దూరంలో సాయుధ గ్రూప్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట్లో ప్రత్యక్షమైంది. జులై 6వ తేదీన ఆంక్షలు సడలించడంతో 17 ఏళ్ల హిజామ్.. నీట్ కోచింగ్ నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పరిస్థితులు సద్దుమణిగాయని భావించిన ఆమె.. తర్వాత తన స్నేహితుడితో బైక్‌పై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లింది. ఇక అప్పటి నుంచి వారి జాడలేకుండా పోయింది. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. వారు ఇంఫాల్‌కు సమీపంలోని నంబోల్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యిందని పోలీసులు అప్పట్లో వెల్లడించారు. ఈ క్రమంలోనే సాయుధులు వారిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్లు ఒక ఫొటోలో ఉండగా.. వారి వెనుక ఇద్దరు సాయుధులు కన్పించారు. పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా వైరల్ అయ్యింది. ఓ జంగిల్ క్యాంపు వద్ద ఆ ఇద్దరూ హతమైనట్లు తెలుస్తోంది. జూలై నుంచి అదృశ్యమైన ఆ ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు జరుగుతోంది. ఈ కేసును సీబీఐ విచారిస్తున్నది. ఏడాది మార్చిలో కుకీ, మైతీ కమ్యూనిటీల మధ్య రాజుకున్న వైరం రానురానూ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఇప్పుడిప్పుడే హింసాకాండ నుంచి రాష్ట్రం కోలుకుంటుండగా మళ్లీ అల్లర్లు తలెత్తాయి. తాజాగా మరో అఘాయిత్యం వెలుగుచూడడంతో.. తీవ్ర ఆగ్రహానికి లోనైన నెటిజన్లు, ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
మరోవైపు ప్రభుత్వం ఈ ఘటనపై స్పందిస్తూ.. సీబీఐ (CBI) దర్యాప్తు ప్రారంభించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు, కుకీ వర్గానికి చెందిన దుండగులు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.