డబ్బున్న మగాళ్లే టార్గెట్..8 మందిని పెళ్లాడిన కిలాడీ లేడీ..
X
డబ్బున్న మగాళ్లే ఆమె టార్గెట్..సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుంటుంది..పైసలు దండిగా ఉన్నాయని తెలుసుకుని దగ్గరవుతుంది..ఆపై పక్కా స్కెచ్ వేసి పెళ్లి చేసుకుంటుంది. ఆ తరువాత ఉన్నదంతా దోచుకుని ఉడాయిస్తుంది. ఇలా తన వలపు వలలో పడిన 8 మంది యువకులను పెళ్లాడి, వారి నుంచి డబ్బు, నగలను దోచుకుని పారిపోయింది. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఇలాంటి పెళ్లిళ్లు చేసుకున్న కిలాడీ లేడి వ్యవహారం తాజాగా బయటికి వచ్చింది. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో రషీద అనే యువతి పరిచయం అయ్యింది. ఈ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ ఏడాది మార్చి 30న పెళ్లి చేసుకున్నారు. అంతా బాగుందనుకునేలోపే, కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇదే క్రమంలో రషీద జులై నెల 4న ఇంట్లో ఉన్న లక్షన్నర నగదు, 5 సవర్ల బంగారు నగలతో ఉడాయించింది. దీంతో మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో యువతి గురించి విస్తుపోయే వాస్తవాలు బయటికి వచ్చాయి. నీలగిరి జిల్లా గూడలూర్‌కు చెందిన రషీద సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు తెరచి డబ్బున్న మగవారితో ఫ్రెండ్ షిప్ చేసేది. ఆ తర్వాత వారిని ట్రాప్లోకి దించి వివాహం చేసుకుంటుందని, అలా పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే గొడవ పెట్టుకుని ఉన్న డబ్బు , నగలతో పారిపోతుందని తెలుసుకున్నారు. ఈ కిలాడీ లేడీ ఇప్పటివరకు కేరళ, కర్ణాటక,ఏపీ రాష్ట్రాల్లో దాదాపు 8 పెళ్లిళ్లు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం యువతి పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.