Basara IIIT:బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని మృతి
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని మృతి
X
మంగళవారం బాసర ట్రిపుల్ ఐటీ లో పీయూసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఇంకా కలకలం రేగుతూనే ఉంది. తన కూతురు మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం అని దీపిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలోనే .. ఆ కాలేజీలో మరో విషాదం చోటు చేసుకుంది. హాస్టల్ బిల్డింగ్ మీది నుంచి దూకి లిఖిత అనే మరో విద్యార్థిని మృతి చెందింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో హాస్టల్ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి పడి మరణించింది. భద్రతా సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసినా ప్రాణాలు దక్కలేదు. మృతురాలు పీయూసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లుగా గుర్తించారు. లిఖిత స్వస్థలం సిద్ధిపేట జిల్లా గజ్వేల్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..
ఇదిలా ఉండగా బుధవారం దీపిక మృతిపట్ల తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. ట్రిపుల్ ఐటీ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు నిరసన తెలిపారు. తమ సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు బైఠాయించి.. నిరసన తెలిపారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను తిరిగి హాస్టల్ లోకి పంపే ప్రయత్నం చేశారు పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది. ట్రిపుల్ ఐటి యాజమాన్యం పిల్లలను పట్టించుకోవడంలేదని, క్యాంపస్‌లో విద్యార్థులు ఎవరు ఏం చేస్తున్నా వారిపై పర్యవేక్షణ లోపించిందని దీపిక తల్లిదండ్రులు ఆరోపించి 24 గంటలు గడవక ముందే మరో విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.