సీఐ ఇంట్లో దొంగలు పడ్డారు.. 7 తులాల బంగారం ఎత్తుకెళ్లారు
X
సామాన్యులు మోసపోయితే పోలీసులను ఆశ్రయిస్తారు. అదే.. పోలీస్ మోస పోతే..? అలాంటి ఘటనే శ్రీకాకులంలోని శాంతి నగర్ లో చోటు చేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సీఐగా పనిచేస్తున్న హరి ఇంట్లో దొంగలు పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. హరి ఈ నెల 3న విధి నిర్వాహన కోసం సారవకోట వెళ్లారు. ఊరికి వెళ్లే క్రమంలో ఇంటి పెరటి ఇనుప గ్రిల్ కు తాళం వేయడం మర్చిపోయాడు. తలుపు కూడా సరిగా వేయకపోవడంతో.. దొంగలు దర్జాగా ఇంట్లోకి ప్రవేశించారు.
బెడ్ రూంలో వెతకగా బీరువా తాళాలు కనిపించాయి. ఇక అంతే.. ఏ కష్టం లేకుండా.. బీరువా తెరిచి ఏడున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన హరి.. పెరట్లోని తలుపులు తెరిచి ఉండటం గమనించాడు. దొంగతనం జరిగిందని గ్రహించి.. టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్లూస్ టీం వేలిముద్రలు సేకరించారు. ఈ దొంగతనాన్ని ఒడిశాకు చెందిన వ్యక్తులు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు