Home > క్రైమ్ > భార్య అందంగా లేదని అదనపు కట్నం అడిగిన భర్త.. పిల్లలతో సహా..

భార్య అందంగా లేదని అదనపు కట్నం అడిగిన భర్త.. పిల్లలతో సహా..

భార్య అందంగా లేదని అదనపు కట్నం అడిగిన భర్త.. పిల్లలతో సహా..
X

హైదరాబాద్‌లోని బన్సీలాల్ పేటలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి.. పుట్టిన కవల పిల్లలతో కలిసి మృత్యు ఒడికి చేరుకుంది. పెళ్లయినప్పటి నుంచి అందంగా లేవంటూ చులకన చేయడంతోపాటు అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న భర్త తీరుతో కవల పిల్లలతోసహా ఆత్మహత్యకు పాల్పడింది. సిద్ధిపేట జిల్లా రామంచకు చెందిన వేమన్న, దుర్గమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు. మూడేళ్లక్రితం చిన్నకూతురు సౌందర్యను సిద్దిపేట జిల్లా కొండాపూర్‌కు చెందిన గణేశ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు.

పెళ్లి సమయంలో రూ.2.5 లక్షల నగదు, 4 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. గణేష్‌, సౌందర్యలు ఉప్పల్‌లోని భరత్‌నగర్‌లో నివాముంటున్నారు. అయితే పెళ్లయిన కొంతకాలానికే అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించసాగాడు. ఏడాదిన్నర క్రితం సౌందర్య కవలలకు జన్మనిచ్చినా భర్త వేధింపులు ఆగలేదు. పలుమార్లు పుట్టింటి నుంచి అడిగిన సొమ్ము తీసుకెళ్లినా అతను మారలేదు. పైగా అందంగా లేవంటూ హింసించడంతోపాటు ఆమె తల్లిదండ్రులకు ప్రభుత్వమిచ్చిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇల్లును తన పేరుమీద రాయాలని ఒత్తిడి చేసేవాడు.

భర్త వేధింపులు పడలేక సౌందర్య 25 రోజుల క్రితం పిల్లలతో సహా పుట్టింటికి చేరింది. ఇక్కడకు వచ్చాకా ఆమెను ఫోన్‌ ద్వారా భర్త వేధించాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు అతడిపై కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు భర్త పనిచేస్తున్న పద్మారావునగర్‌లోని దుకాణానికి వెళ్లిన సౌందర్య... తనను తీసుకెళ్లాలంటూ భర్తను కోరినా వినలేదు. దాంతో బన్సీలాల్‌పేటకు తిరిగొచ్చి, ఇంట్లో తల్లి నిద్రపోతున్న సమయంలో ఇద్దరు పిల్లలతో 8వ అంతస్తు పైకి వెళ్లింది. మొదట పిల్లలను కిందకు తోసేసి, ఆమె కూడా దూకేసింది. ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు భర్త గణేష్ ను అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామార్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Updated : 20 Jun 2023 9:07 AM IST
Tags:    
Next Story
Share it
Top