చిన్నారిని కాపాడే ప్రయత్నం.. విద్యుత్ షాక్తో మహిళ మృతి
X
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్కు గురైన చిన్నారిని రక్షించే ప్రయత్నంలో ఓ మహిళ మృత్యువాతపడింది. హృదయవిదారకమైన ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హైదర్ నగర్ డివిజన్ అడ్డగుట్ట సొసైటీలోని ఓ అపార్ట్మెంట్ కు శ్రీను వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి అదే అపార్మెంట్లో ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం శ్రీను కూతుళ్లిద్దరూ బంధువుల అమ్మాయైన ఐదేండ్ల మహాలక్ష్మితో కలిసి ఆడుకునేందుకు అపార్ట్మెంట్ వెనకాల ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లారు. పిల్లలు సరదాగా ఆడుకుటుండగా ఊహించని ప్రమాదం జరిగింది.
చిన్నారులు ఆడుకుంటున్న దగ్గర ఉన్న చెట్టుపై ప్రమాదవశాత్తూ విద్యుత్ వైర్లు తెగిపడటంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ విషయం తెలియని శ్రీలక్ష్మి చెట్టును పట్టుకోవటంలో పాపకు షాక్ కొట్టింది. శ్రీలక్ష్మి అరుపులు విని పక్కనే ఉన్న వాచ్మెన్ శ్రీను, అతని భార్య బాపనమ్మ పరుగున వచ్చి చిన్నారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో బాపనమ్మ షాక్ గురై మృతి చెందగా, పాపకు గాయాలయ్యాయి. శ్రీలక్ష్మి కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పాపను కాపాడబోయి చనిపోయిన బాపనమ్మ నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.