సాయినగర్ షిర్డీ రైలులో యువతుల హల్చల్.. చోరీ చేసి చైన్ లాగి..
X
నిజామాబాద్ మీదుగా తిరుపతి నుంచి షిర్డీ వెళ్తున్న సాయినగర్ షిర్డీ రైలులో తొమ్మిది మంది యువతులు హల్చల్ చేశారు. సాధారణ ప్రయాణికులులా ట్రైన్ ఎక్కి చోరీలకు పాల్పడ్డారు. ప్రయాణికుల వస్తువులు, బ్యాగులను దోచేశారు. చోరీ అయ్యాక చైన్ లాగి బ్యాగులతో పరుగులు తీశారు. ఆ తొమ్మది మంది యువతులను పట్టుకున్న ప్రయాణికులు పోలీసులకు అప్పగించారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచి 3 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.
తిరుపతి నుంచి షిర్డీ వెళ్తున్న సాయినగర్ షిర్డీ రైలు నిజామాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత నవీపేట్ స్టేషన్ వద్ద క్రాసింగ్ ఉండటంతో అక్కడ అగిపోయింది. దీంతో మహారాష్ట్రలోని బిడ్ జిల్లాకు చెందిన తొమ్మిది మంది యువతులు రైలు ఎక్కారు. ఎస్1 నుంచి ఎస్10 బోగీలలో అటుఇటూ తిరిగి నిద్రపోతున్న ప్రయాణికుల సామాగ్రిని దొంగలించారు. మొదట ఓ బోగీలో ప్రయాణికుడి బ్యాగ్ కనబడకపోవడంతో కంగారు పడ్డాడు. తర్వాత కొందరి ప్రయాణికుల బ్యాగులు కూడా కనిపించలేదని గుర్తించడంతో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి బాసర వద్ద చైన్ లాగడంతో ట్రైన్ ఆగిపోయింది. రైలు ఆగగానే కొందరు యువతులు బ్యాగులతో పరుగెత్తడంతో ప్రయాణికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమారమందించి తొమ్మిది మందిని అప్పగించారు. ఆర్‌ఎస్‌ఎఫ్, బాసర పోలీసులు అక్కడి నుంచి యువతులను నిజామాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
రంగస్వామి అనే ప్రయాణికుడికి చెందిన బ్యాగ్ తో పాటు ల్యాప్‌ట్యాప్, కొంత నగదు, ఓ మహిళ మెడలోని బంగారు చైన్ పోయినట్లు తెలిసింది. పావని, ధనుంజయ్, షేక్ నజీర్ బాషా, లీలావతి, సుబ్బారాయుడు, శ్రీనివాస్ అనే ప్రయాణికుల బ్యాగ్‌లు పోయాయి. మూడు బ్యాగ్‌లను పోలీసులు రైల్వే పట్టాల పక్కన గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని బ్యాగులను నిందితులు బాత్రూమ్‌ల్లో పెట్టినట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.