వినాయక చవితి తేదీపై భాగ్యనగర్ ఉత్సవ కమిటీ క్లారిటీ
X
గణేశ్ చతుర్థికి సంబంధించి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ కీలక ప్రకటన చేసింది. వినాయక చవితి నిర్వాహణ తేదీపై నెలకొన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 19న వినాయక చవితి పండుగా నిర్వహించుకోవాలని సూచించింది. 28న నిమజ్జనం ఉంటుందని స్పష్టం చేసింది. గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై చర్చించేందుకు సోమవారం భేటీ అయిన భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు ఈ మేరకు ప్రకటన చేశారు.
ఈ ఏడాది వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలన్న సందేహం ప్రజల్లో నెలకొంది. సెప్టెంబర్ 18 మధ్యాహ్నం ప్రారంభం కానున్న చవితి ఘడియలు 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటాయి. సూర్యోదయం తర్వాత వచ్చిన తిథినే పండుగ రోజుగా గుర్తిస్తారని, అందుకే 19వ తేదీన సాంప్రదాయబద్దంగా వినాయక చవితి పూజ జరుపనున్నట్లు ప్రకటించారు.
గణేష్ మండపాలకు పోలీసు పర్మిషన్ తప్పనిసరి కాదని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. అయితే స్థానిక పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గణేశ్ ఉత్సవాల్లో ఫ్లెక్సీలను నిషేధించినట్లు చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలకు రావాలని సీఎం కేసీఆర్ను ఆహ్వానించనున్నట్లు చెప్పారు.