Sabarimala Temple: తెరుచుకున్న ఆలయం.. శబరిమలకు పోటెత్తిన భక్తులు
X
కేరళలోని ప్రసిద్ధి చెందింన శబరిమల అయ్యప్ప క్షేత్రంలో వార్షిక వేడుకలు ఈ శుక్రవారం మొదలయ్యాయి. అయ్యప్ప దర్శనం కోసం దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఇరుముడితో శబరిమల ఎక్కి అయ్యప్ప భక్తులు.. స్వామివారిని దర్శించుకుంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి అయ్యప్ప సన్నిధానం, పంబ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. అయ్యప్ప దర్శనాలకు సంబంధించి ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
మండల పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం గురువారం సాయంత్రం తెరుచుకుంది. నవంబర్ 17వ తేదీన స్వామివారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. మండల మకరవిళక్కు వేడుకలు కూడా మొదలయ్యాయి. రెండు నెలలపాటు కొనసాగే మణికంఠుడి మహాదర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేరళ దేవాదాయ శాఖ మంత్రి కే రాధాకృష్ణ వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.
తోపులాటలు సహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేరళ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధునాతన సాంకేతికతతో భక్తుల రాకపోకలపై నిఘా ఉంచారు. అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలను అమర్చారు. 13వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తాత్కాలిక పోలీస్ స్టేషన్లను నెలకొల్పారు. ఎన్డీఆర్ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వంటి దళాలను సైతం అందుబాటులో ఉంచారు. కేంద్రమంత్రి శోభా కరంద్లాజే కూడా ఈ రోజే అయ్యప్ప దేవాలయాన్ని సందర్శించారు.