శ్రీవారికి ఎంత బంగారం ఉందో తెలుసా? ఆసక్తి రేపుతున్న ఈవో వ్యాఖ్యలు
X
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల్లో తిరుమల శ్రీవారి ఆలయం ఒకటి. కోట్ల మంది ఆ దేవున్ని నమ్ముతారు. తమ కోరికలు తీరినా, తీరాల్సిన కోరికలు ఉన్నా వాటి కోసం విలువైన కానుకలు సమర్పించుకుంటారు. అలా ఏటా కొన్ని కోట్ల ఆదాయం శ్రీవారి ఆలయానికి వస్తుంది. అందులో డబ్బుతో పాటు.. బంగారం, వెండి, వజ్రాలు కూడా ఉంటాయి. అయితే, ఏటా ఇంతమంది కానుకలు సమర్పిస్తున్నారు కదా. ఇప్పటివరకు శ్రీవారి ఆలయానికి ఎంత బంగారం పోగయుంటుంది? అనే ప్రశ్న చాలామందిలో తలెత్తే ఉంటుంది. ఆ ప్రశ్నకు క్లారిటీ ఇస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్వారెడ్డి సమాచారాన్ని ప్రకటించారు.
వారణాసిలో జరిగిన అంతర్జాతీయ ఆలయాల సమావేశంలో పాల్గొన్న ఆయన.. తిరుమల ఆలయం గురించి కొన్ని ఆసక్తి కర వివరాలు తెలిపారు. ‘దేశ వ్యాప్తంగా తితిదే 71 ఆలయాలను నిర్వహింస్తోంది. శ్రీవారి అలంకరణకు ఉపయోగించే బంగారు ఆభరణాలు 1.2 టన్నులు, వెండి 10 టన్నులు ఉంటుంది. ఏడాదికి 500 టన్నుల పువ్వులతో అలంకరిస్తారు. తితిదేలో 24,500 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఆలయంలో భక్తులకు సేవలందించడానికి రోజుకు 800 మంది విధుల్లో ఉంటారు. ప్రసాదాల తయ్యారికి ఏటా 500 టన్నుల నెయ్యి వాడతారు. తితిదే పరిదిలో 600 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. శ్రీవారి పేరుతో రూ.17వేల కోట్ల డబ్బు, 11 టన్నుల బంగారం బ్యాంకులో డిపాజిట్ అయి ఉంద’ని ధర్మారెడ్డి వివరించారు.