Medaram Mahajatara : మరో మూడు రోజుల్లో మహాజాతర...భారీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
X
ఆసియాలోనే అతిపెద్ద జనజాతరకు తెలంగాణ ముస్తాబవుతోంది. మరో మూడు రోజుల్లో మహాజాతర సమీపిస్తుడడంతో అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి భక్తులు బారులు తీరారు. ముందుగా జంపన్న వాగులో తలనీలాలు సమర్పించి స్నానం చేసి వనదేవతను దర్శించుకుంటున్నారు. గద్దెలపై ఉన్న సమ్మక్క, సారలమ్మను దర్శించుకొని పునీతులవుతున్నారు. అంతేగాక వనదేవతలకు కోడె మొక్కులు, బంగారం చెల్లించుకుంటున్నారు. భక్తుల రాకతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. వివిధ ప్రాంతాలను భక్తులు భారీగా తరలివస్తుడడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
జాతరకు భారీ ఏర్పాట్లు..
మేడారం సమ్మక, సారలమ్మ జాతరకు విస్తృ త ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జాతరకు ముందుగానే పెద్ద సంఖ్యలో మేడారానికి భక్తులు వస్తున్నారని, జాతర ప్రారంభం నాటికి వారి సంఖ్య మరింత పెరుగుతుందని ఆమె చెప్పారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ బందోబస్తు, చెక్ పోస్టులు ఏర్పాటుచేయాలని సూచించారు. దాదాపు 4,800 సీసీ కెమెరాలను పెట్టనున్నట్టు అధికారులు తెలిపారు. ఇవాల్టి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 6 వేల బస్సులను మేడారానికి నడుపుతున్నట్లు చెప్పారు. అంతేగాక మేడారంలో 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేశామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు 4000 మంది కార్మికులను నియమించామని సీఎస్ శాంతికుమారి చెప్పారు.
భారీగా పెరిగిన ధరలు..
రెండేండ్లకోసారి జరిగే మేడారం మహాజాతరను కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు ఆసరాగా తీసుకుంటున్నారు. ఇదే అదననుకొని జాతరనే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. తల్లుల చెంతకు కోట్లాదిగా తరలివచ్చే భక్తుల వద్ద నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. జాతర నేపథ్యంలో అమ్మాకాల రేట్లను భారీగా పెంచారు.