Home > భక్తి > Medaram jathara : సంపెంగ వాగు జంపన్నవాగు ఎలా మారింది..?

Medaram jathara : సంపెంగ వాగు జంపన్నవాగు ఎలా మారింది..?

Medaram jathara : సంపెంగ వాగు జంపన్నవాగు ఎలా మారింది..?
X

మేడారం జాతరకు మరో వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ సంఖ్యలో జనం మేడారం బాటపట్టారు. అయితే సమ్మక్క సారక్క గద్దెల వద్ద ఎంత మంది జనం కనిపిస్తారో అంతే మంది జనం జంపన్న వాగు దగ్గరా ఉంటారు. తల్లులను దర్శించుకునే ముందు ఈ వాగులో స్నానాలు చేస్తారు. ఆ తర్వాతే మెుక్కులు తీర్చుకుంటారు. అలా చేస్తే అమ్మవార్ల చల్లని చూపు తమపై ఉంటుందని భక్తుల విశ్వాసం. జంపన్న వాగులో స్నానం చేస్తే సకల రోగాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు. ఇంతకీ ఒకప్పటి సంపెంగ వాగు ఇప్పుడు జంపన్న వాగు ఎలా అయింది. చరిత్ర ఏం చెబుతోంది..?

12 శతాబ్దంలో కరీంనగర్‌ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని ‘పొలవాస’ను గిరిజన దొర మేడరాజు పాలించేవాడు. ఓ రోజు వేట కోసం అడవిలోకి వెళ్లిన రాజుకు అక్కడ పులుల సంరక్షణలో, దివ్యకాంతులతో ఓ బాలిక కనిపించిందట. ఆమెను చూసి జనకుడికి సీతాదేవి దొరికినట్టు.. తమకు ఆ బిడ్డ దొరికింది భావించి ఇంటికి తీసుకొచ్చాడట. అలా దొరికిన బిడ్డకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. వయసు వచ్చిన తర్వాత సమ్మక్కను మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఈయన మేడరాజుకు మేనల్లుడు. పగిడిద్దరాజు - సమ్మక్క దంపతులకు కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మతో పాటు కుమారుడు జంపన్న పుట్టారు.

సమ్మక్క బిడ్డ సారలమ్మకు గోవిందరాజుతో పెళ్లి చేశారు. ఆ సమయంలో మేడారాన్ని కాకతీయులు పాలించేవారు. పగిడిద్ద రాజు కూడా కాకతీయుల కిందే పనిచేసేవాడు. ఓసారి కాకతీయులు పగిడిద్ద రాజును ఎక్కువ కప్పం కట్టాలని ఒత్తిడి తేగా.. ప్రజలు సమస్యల్లో కట్టలేమని చెప్పాడు. దీంతో కాకతీయులు మేడారంపై యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధంలో పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగులమ్మ చనిపోయారు. యుద్ధంలో తీవ్ర గాయాలపాలైన జంపన్న.. ఓటమిని అంగీకరించక, శత్రువుల చేతిలో చావడం ఇష్టం లేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడట. దీంతో ఆయన రక్తం కలిసి వాగులోని నీళ్లన్నీ ఎర్రగా మారిపోయాయట. ఇక అప్పటి నుంచి సంపెంగ వాగు కాస్తా జంపన్న వాగుగా మారింది. జంపన్న వాగు గోదావరికి ఉపనది. అయితే ఇప్పటికీ ఆ వాగులో నీళ్లు కాస్త ఎర్ర రంగులో కనిపిస్తుంటాయి. అందుకు కారణం ఆ ప్రాంతంలోని నేల స్వభావం. జంపన్న వాగులో స్నానం చేస్తే అమ్మల దయతో సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.




Updated : 16 Feb 2024 7:51 AM IST
Tags:    
Next Story
Share it
Top