అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తున్నారా.. అయితే ఇవి గుర్తుంచుకోండి..
X
జనవరి 22న అయోధ్య రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 23 నుంచి భక్తులందరికీ రామయ్య దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ క్రమంలో చాలామంది అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అయోధ్య రామ మందిరంలో దర్శనం ఎప్పుడు, ఎలా చేసుకోవాలన్న విషయాలు గురించి తెలుసుకుందాం.
అయోధ్య రామ మందిరంలో బాలరామునికి ఐదుసార్లు హారతి ఇవ్వనున్నారు. అయితే భక్తులకు 3 హారతులకు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుంది. ఉదయం 6:30 గంటలకు, మధ్యాహ్నం 12:00 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు ఈ హారతి నిర్వహిస్తారు. శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6 నుండి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు.
అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం https://online.srjbtkshetra.org అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక ‘దర్శన్’ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అందులో దర్శనం చేసుకోవాల్సిన తేదీ, సమయం, ఎంత మంది దర్శనానికి వచ్చే భకర్తుల వివరాలు, దేశం, రాష్ట్రం, మొబైల్ నెంబర్‌తో పాటు ఫోటో అప్‌లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది.
ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు తీసుకోవాలనుకుంటే రామమందిరం దగ్గరలోని కౌంటర్‌కు వెళ్లి, ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపి టికెట్ తీసుకోవచ్చు. పదేళ్లకన్నా తక్కువ వయసు కలిగిన పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్‌తో పాటు ఐడీప్రూప్ తీసుకువెళ్లాలి. దర్శనానికి 24 గంటల ముందు వరకు భక్తుడు టిక్కెట్ రద్దు చేసుకోవచ్చు. రామయ్య దర్శనానికి స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.