సంక్రాంతి రోజున ఈ దానాలు, పనులు చేస్తే కచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహమే
X
తెలుగింట సంక్రాంతి పండుగ శోభ రానే వచ్చింది. డూ.. డూ.. బసవన్నల ఆటపాటలు. ముంగిట్లో రంగవల్లులు. నోరూరించే పిండి వంటలు. సంప్రదాయాన్నిచ్చే కొత్త దుస్తులు.. ప్రతీ ఇంట సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతాయి. కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి.. ఘనంగా సంక్రాంతిని జరుపుకుంటారు. తెలుగువారికి అతి పెద్ద పండగ కావున.. ప్రపంచంలో ఏ మూలనున్నా సొంతూరికి వచ్చి పండగను జరుపుకుంటారు. అయితే.. ఇప్పటి మోడ్రన్ సొసైటీలో చాలామందికి సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు, సంక్రాంతి ప్రాముఖ్యత ఏంటో తెలియదు. అలాంటి వారికోసం..
సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతాడు. దాన్నే సంక్రాంతి అంటారు. పంచాంగం ప్రకారం సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు వస్తాయి. అయితే వాటిలో పుష్యమాసంలో వచ్చే మకర సంక్రాంతి విశేషమైనది. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారిన ఉత్తరాయణ పుణ్యకాలంలో.. సంక్రాంతి సంబరాలూ ప్రారంభమవుతాయి. మకర సంక్రాంతి రోజున నదీ స్నానం, దానధర్మాలు, పూజలు చేస్తారు. ఈ పండగ రోజున ఏ దానము చేసినా.. దాని ఫలితము రెట్టింపవుతుందని విశ్వాసం. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని కొందరి నమ్మకం. అందుకే సంక్రాంతి రోజున కొన్ని పనులు తప్పక చేయాలని పెద్దలు చెప్తుంటారు. ఈ రోజున చేయాల్సిన పనులేంటంటే..
సంక్రాంతి రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల విశేష పుణ్యం కలుగుతుందని విశ్వాసం. ఈ రోజున గంగామాత భూమికి వచ్చిందని ప్రతీతి. అందుకే ముఖ్యంగా సంక్రాంతి రోజున గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందని పెద్దలు చెప్తుంటారు.
సంక్రాంతి రోజు లక్ష్మీదేవికి ఆవు నెయ్యిలో తెల్ల నువ్వులను కలిపి శ్రీ సూక్తహవనం చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నిలుస్తుందని, ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్మకం.
తెల్ల నువ్వులు లేదా నువ్వులు, బెల్లం, తేనెను సంక్రాంతి పండగ రోజు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
ఆవును హిందువులు దేవతగా కొలుస్తారు. సకల దేవతలు ఆవులో కొలువై ఉంటారని నమ్ముతారు. అందుకే సంక్రాంతి రోజున ఆవుకు పచ్చిగడ్డిని ఆహారంగా అందిస్తే సంతోషం, సౌభాగ్యం కలుగుతాయనిన విశ్వాసం.
బియ్యం పరమాన్నం తయారు చేసి దేవుడికి నైవేద్యం పెడతారు. తర్వాత ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచిపెడతారు. ఇలా చేయడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని నమ్మకం.
సంక్రాంతి రోజు చీపురు కొనడం కూడా శుభప్రదంగా కొంతమంది భావిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని నమ్ముతారు.
ఓం హ్రీం హ్రీం శ్రీ సూర్య సహస్రకిరణాయ నమ: అంటూ సంక్రాంతి రోజున ఈ మంత్రాన్ని 108 సార్లు పలికితే కోరిన కోరికలు నెరవేరుతాయి.
సంక్రాంతి రోజున సూర్యుడితో పాటు శనిదేవుడిని పూజించడం ద్వారా ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి లభిస్తుందని, కష్టాల నుంచి ఉపశమనం దక్కుతుందని విశ్వాసం.