Home > భక్తి > రేపే కృష్ణాష్టమి..ఈ రోజు ఇలా చేస్తే మీకు శుభ ఫలితాలు

రేపే కృష్ణాష్టమి..ఈ రోజు ఇలా చేస్తే మీకు శుభ ఫలితాలు

రేపే కృష్ణాష్టమి..ఈ రోజు ఇలా చేస్తే మీకు శుభ ఫలితాలు
X

కృష్ణాష్టమి.. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే వేడుక . ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణుణి ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు భక్తులు. ఇస్కాన్ టెంపుల్స్‎లో అయితే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అంతే కాదు ఈ వేడుకలను పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో ఉట్టి కొట్టడం, గీతాపఠనం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ రోజున ఎంతో భక్తితో కన్నయ్యకు భక్తులు ప్రత్యేక పూజలు, సేవలు చేస్తారు. ముఖ్యంగా సంతానలేమితో బాధపడేవారు ఈ జన్మాష్టమి రోజున కృష్ణుడిని ఆరాధిస్తే చిన్నారి కృష్ణుడు వారి ఇంట్లో అడుగుపెడతారని భక్తుల విశ్వాసం. ఎవరైతే కృష్ణుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో సకల సౌభాగ్యాలు లభిస్తాయని నమ్మకం.

కృష్ణాష్టమి విశిష్టత :

శ్రీమహావిష్ణువు ఈ లోకాన్ని ఉద్దరించడానికి శ్రీ కృష్ణుడిగా అవతరించాడు. దేవకీవసుదేవులకు ఎనిమిదో సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రావణమాసంలో కృష్ణపక్షం అష్టమి తిధి రోజున కంసుడి చెరసాలలో నల్లనయ్య జన్మించాడు. అందుకే శ్రావణ బహుళ అష్టమి తిథి రోజున కృష్ణాష్టమిని జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని కృష్ణుణి జన్మాష్టమిగా, కృష్ణాష్టమిగా, గోకులాష్టమిగా, అష్టమిరోహిణిగా భక్తులు పిలుస్తారు. ఈ రోజున కృష్ణుడిని ఆరాధించడం వలన స్వామి అనుగ్రహం పొంది శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.

పర్వదినం..పూజా విధానం :

ఉదయం లేవగానే తలారా స్నానమాచరించాలి. గడపలకు పసుపు రాసి పసుపు , కుంకుమ పెట్టి, గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించి, ఇంటి ముంగిట కల్లాపు చల్లి అందమైన ముగ్గులు వేసి, కృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్లుగా పిండితో ఆయన బుల్లి బుల్లి పాదాలు వేయాలి. ఈ రోజున స్వామి వారిని ఆరాధించడం అంటే ,చిన్న పిల్లలను ఎంత గారాబంగా పెంచుతామో , ఎంత చక్కగా వారిని ముస్తాబు చేస్తామో, అదే విధంగా కన్నయ్యను అలంకరించాలి. ముందుగా చిన్ని కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో భక్తితో అభిషేకం చేయాలి. ఆ తర్వాత నీటితో అభిషేకం చేయాలి. ఆ తరువాత విగ్రహానికి పట్టు వస్త్రాలు వేయాలి, ఆభరణాలను అలంకరించాలి. ఆ తరువాత స్వామికి అత్యంత ప్రీతికరమైన తులసి మాలను ఆయన మెడలో వేయాలి. శక్తి మేరకు నైవేద్యాలను సిద్ధం చేసి కృష్ణుయ్యకు సమర్పించాలి. నైవేద్యంతో కన్నయ్యకు ఇష్టమైన వెన్న ముద్దను పెడితే ఎంతో తృతి చెందుతాడని పండితుల మాట. ఆ తర్వాత కృష్ణయ్య విగ్రహాన్ని ఊయలలో ఉంచి లాలి పాట పాడుతూ కాసేపు ఊపాలి. అనంతరం ఇంటికి పిలిచిన ముత్తయిదువులకు వాయినాలు సమర్పించాలి.

ఉట్టి కొట్టడం ఓ సంబరం :

ఉత్తరాధిన కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టే సంబరాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రతి ఇంటికి వెళ్లి మట్టికుండలో పాలను, పెరుగును, చిల్లర పైసలను సేకరిస్తారు. ఈ మట్టి కుండను ఉట్టిలో పెట్టి పొడవైన తాడుతో కట్టి సామూహికంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని జరుపుతారు. ఈ ఉత్సవాన్ని పిల్లలు, యువకులు ఎంతో ఉత్సాహంగా జరుపుతారు.

కృష్ణాష్టమి ఎప్పుడు చేసుకోవాలి :

ఈఏడాది అదికమాసం రావడంతో ప్రతీ పండగ తేదీల్లో గందరగోళం నెలకొంటోంది. పండగలు, పర్వదినాల విషయంలో కొంత అస్పష్టత నెలకొంది. తిథులు, పంచాగాన్ని ఆధారంగా చేసుకుని చూస్తే ఒక్కో పండగ, శుభ ఘడియలు రెండు రోజులు వస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీ కృష్ణాస్టమిపై కూడా చాలామందిలో గందరగోళం నెలకొంది. ఒక్కో క్యాలెండర్ లో 6, 7వ తేదీలు ఉండగా.. అసలు ఏ తేదీన పండగ జరుపుకోవాలన్నది తేలట్లేదు. అయితే పంచాంగ కర్తలు సూచిస్తున్న దాని ప్రకారం సెప్టెంబర్ 6వ తేదీనే జన్మాష్టమి వస్తుంది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు.. శ్రావణ మాసం బహుళాష్టమి అర్ధరాత్రి సమయంలో జన్మించాడు. సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 3:27 గంటలకు అష్టమి తిథి ప్రారంభమై.. 7న సాయంత్రం 04:14 గంటలకు ముగుస్తుంది. రోహిణి నక్షత్రం 6న ఉదయం 09:20 గంటలకు ప్రారంభమై.. 7న ఉదయం 10:25 గంటల వరకు కొనసాగుతుంది. అయితే నిషిత కాలంలో కృష్ణుని ఆరాధన కారణంగా పండుగను 6న జరుపుకుంటారు. 6వ తేదీన జన్మాష్టమి, 7వ తేదీన ఉట్టి కొట్టే వేడుకను నిర్వహించాల్సి ఉంటుంది. పూజకు అనుకూలమైన సమయం రాత్రి 11:57 గంటలకు మొదలవుతుంది.

Updated : 5 Sep 2023 3:17 PM GMT
Tags:    
Next Story
Share it
Top