తొలి మొక్కు రాజన్నకే.. ఆ తర్వాతే అమ్మల దర్శనానికి
X
మరికొద్ది గంటల్లో తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ప్రారంభం కానుంది. దాదాపు 2 కోట్లకు పైగా వచ్చే భక్తలకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. అయితే మేడారానికి వచ్చే భక్తుల్లో చాలామంది తొలి మొక్కును వేములవాడ రాజన్నకే సమర్పిస్తారు. ఆ తర్వాత కొండగట్టు అంజన్న, కొమురవెళ్లి మల్లన్న, ధర్మపురి నర్సన్నను దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత తల్లుల దర్శనానికి బైలెల్లుతారు. మేడారం జాతరకు నెల రోజుల ముందు నుంచే వేములవాడలో భక్తుల రద్దీ ఉంటుంది. అక్కడ దర్శనం పూర్తైయ్యాక మేడారానికి వెళ్లేందుకు కిరాయి తీసుకుంటారు. రూ.5వేల వరకు చెల్లిస్తే.. మేడారం జాతరకు వెళ్లొచ్చు. అయితే ఈసారి మహిళలకు మహాలక్ష్మీ స్కీం కింద ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం ఉన్నందున చాలామంది బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు.
గేట్ వే ఆఫ్ మేడారంగా గట్టమ్మ తల్లి ఆలయాన్నికి పేరుంది. మేడారానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా గట్టమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. మేడారం గిరిజన రాజ్య స్వతంత్రం కోసం, గిరిజనుల సాధికారత కోసం సాగిన యుద్ధంలో సమ్మక్కకు గట్టమ్మ తల్లి అంగరక్షకురాలిగా ఉందట. శత్రువుల పట్ల అసమాన ధైర్య సాహసాలు కనబరిచిన వీరవనితగా గట్టమ్మ తల్లి చరిత్రకెక్కింది. గట్టమ్మతో పాటు అంగరక్షకులుగా సూరపల్లి సూరక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క తదితరులు ఉండేవారు. వాళ్లంతా యుద్ధ రంగంలో శత్రువల నుంచి కాపాడుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరులైయ్యారు. అందుకే గిరిజనులు వారిని కూడా దేవతలుగా కొలుస్తారు.