Home > భక్తి > Medaram Jathara : మేడారం జాతరలో ఏ రోజు ఏం జరుగుతుందంటే..?

Medaram Jathara : మేడారం జాతరలో ఏ రోజు ఏం జరుగుతుందంటే..?

Medaram Jathara : మేడారం జాతరలో ఏ రోజు ఏం జరుగుతుందంటే..?
X

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతరకు సర్వం సిద్ధమైంది. కోరుకున్న వారి కొంగుబంగారమైన ఈ అమ్మల జాతర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నమ్ముకున్నోళ్ల కోసం ప్రాణార్పణం చేసిన దేవతలుగా కొలిచే పండుగ మేడారం జాతర. ఆదివాసీల దేవతలైన సమ్మక్క, సారలమ్మలు కాలక్రమంలో అందరి అమ్మలయ్యారు. మేడారంలో అమ్మలు గద్దెలపైకి రావడమే ఓ ఉత్సవం. మాఘమాసం శుక్లపక్ష ద్వాదశి నుంచి పౌర్ణమి వరకు నాలుగు రోజుల పాటు సాగే ఈ జాతర కన్నుల పండుగే.

జాతరలో భాగంగా మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువస్తారు. సారలమ్మ గద్దె పైకి రాకముందే ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం కొండాయి నుంచి గోవింద రాజును, మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. రెండో రోజు సాయంత్రం వడ్డెలు మేడారంలోని చిలుకలగుట్టపైకి వెళ్లి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క, సారలమ్మల రాకతో మేడారం పులకించిపోతుంది. ఇక మూడో రోజున సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజున మేడారం ఇసకేస్తే రాలనంత మంది భక్తులతో మేడారం కిక్కిరిసిపోతుంది. చివరగా నాలుగోరోజు సమ్మక్కను చిలుకల గుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకొని వెళతారు. దేవతలు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.

సమ్మక్క, సారలమ్మ జాతర గిరిజన సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. అమ్మలిద్దరికీ ఎలాంటి విగ్రహాలు ఉండవు. రెండు గద్దెలు మాత్రమే ఉంటాయి. ప్రతి గద్దె మధ్యలో ఉండే చెట్టు కాండాలనే వన దేవతలుగా భావిస్తారు. దేవతామూర్తులను తీసుకొచ్చే వడ్డెలు తమ పైనుంచి దాటుకుంటూ వెళితే జన్మ సార్థకమవుతుందని భక్తుల విశ్వాసం. సమ్మక్క కుమారుడైన జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత గద్దెల దగ్గరికి వెళ్లి అమ్మలను దర్శించుకుంటారు. సమ్మక్క - సారలమ్మలను దర్శించుకునే భక్తులు వనదేవతలకు తమ బరువుకు సమానంగా బంగారం (బెల్లం) సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. నిజానికి మేడారం జాతరలో బెల్లమే ప్రసాదం.

మేడారం జాతర అచ్చమైన గిరిజన జాతర. అందుకే అక్కడ మద్యం, మాంసం సాధారణం. జాతరకు వచ్చే భక్తులకు శుద్ధి, నియమాలు ఉండవు. త్యాగాల తల్లులను కొలిచే మేడారం జాతరకు ప్రతి మహిళా వెళ్లొచ్చు. అంటు, ముట్టు అనేది ఉండదు. నిజానికి మేడారంలో నమ్మకాలే పూజలు. ఆచారాలే ఆరాధనలు.


Updated : 20 Feb 2024 10:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top