గణేష్ చవితి రోజు చంద్రున్ని చూస్తే ఏమవుతుంది..?
X
దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. సోమవారం భక్తులు బొజ్జ గణపయ్యను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. 'భాద్రపద శుద్ధ చవితి' రోజున గణేశుడు జన్మించినందున ఈ రోజు నుంచి నవరాత్రి వేడుకలు ప్రారంభమవుతాయి. అయితే వినాయక చవితి పండగకు ఓ ప్రత్యేకత ఉంది. చవితి రోజున చంద్రున్ని చూడొద్దని పెద్దలు చెబుతుంటారు.ఒక వేళ ఆ రోజు రాత్రి చందమామని చూస్తే అందరి చేత మాటలు పడాల్సి వస్తుందన్నది చాలా మంది నమ్మకం. చవితి రోజు చంద్రున్ని చూస్తే నీలాపనిందల పాలవుతారని చాలా మంది చెబుతుంటారు. ఇంతకీ ఆ కథ ఏంటి?
పురాణాల ప్రకారం పార్వతి దేవి స్నానానికి వెళ్తూ పిండితో ఓ బాలుడి బొమ్మ తయారు చేసి ప్రాణం పోస్తుంది. తాను స్నానమాడి వచ్చే వరకు కాపాలాగా ఉండమని చెబుతుంది. అలా పార్వతీ దేవి వెళ్లగానే పరమేశ్వరడు అక్కడికి వెళ్తాడు. దీంతో ఈ బాలుడు శివున్ని లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటాడు. దీంతో శివునికి ఆగ్రహం వస్తుంది. కోపంతో బాలుడి తలను త్రిశూలంతో చేధిస్తాడు. బయటకు వచ్చిన పార్వతీ దేవి తల మొండెం వేరైన దృశ్యాన్ని చూసి తీవ్రంగా రోదిస్తుంది. పార్వతి దేవి బాధను చూసి పరమేశ్వరుడు తూర్పు దిశలో ఉన్న ఏనుగు తలను తెప్పించి బాలుడికి అతికించి మళ్లీ ప్రాణం పోస్తాడు. ఆ బాలుడికి గజాననుడని పేరు పెడతారు.
ఏనుగు తల పెట్టిన తర్వాత కైలాసం చేరుకున్న గజాననుడు కైలాసం చేరుకుంటాడు. తన పొట్టతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అది చూసి చంద్రుడు నవ్వడంతో గణేశుడి ఉదరం పగిలి అందులోకి కుడుములు, ఉండ్రాళ్లు అన్నీ బయటకు వస్తాయి. కొడుకు పరిస్థితి చూసిన పార్వతీ దేవి చంద్రుని వల్లే తన కుమారుడికి ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహానికి లోనవుతుంది. చందమామను ఎవరు చూసినా నిందలు మోయాల్సి వస్తుందని శపిస్తుంది. అయితే దేవతలందరూ వేడుకోవడంతో కేవలం వినాయకుడి పుట్టిన రోజైన భాద్రపద శుద్ధ చవితి రోజు చూసిన వారు మాత్రమే నిందల పాలవుతారని చెప్పినట్లు పురాణాల్లో ఉంది. అయితే చవితి రోజు వినాయకుడి అక్షింతలు వేసుకుంటే ఆ శాపం వర్తించదని శాస్త్రం చెబుతోంది.