వైభవంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
X
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజైన సోమవారం ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి. స్వామివారి చక్రస్నానం తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేశారు. శ్రీవారి చక్రస్నానం అనంతరం పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
బ్రహ్మోత్సవాల చివరి రోజున తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం చేశారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి శిష్య బృందం పఠించారు.
వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం రామకృష్ణ దీక్షితులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 9 రోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై - లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ - చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక - యజ్ఞాంతంలో అవభృథస్నానం చేస్తారు. యజ్ఞ నిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం. ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ - అందరికీ ఈ ఉత్సవయజ్ఞఫలం లభిస్తుంది.
Sri malayappaswamy navaratri brahmotsavalu concluded
andharapradesh,tirumala,tirupati,ttd,tirumala tirupati devasthanam,sri malayappaswamy,navaratri brahmotsavalu,chakra snanam,tirumala srivaru,pushkarini,sridevi,bhudevi,brahmotsavalu