Home > భక్తి > టీటీడీ బోర్డు నుంచి ఇతణ్ని తప్పించడం దేవుడి తరం కూడా కాదు..!

టీటీడీ బోర్డు నుంచి ఇతణ్ని తప్పించడం దేవుడి తరం కూడా కాదు..!

టీటీడీ బోర్డు నుంచి ఇతణ్ని తప్పించడం దేవుడి తరం కూడా కాదు..!
X

కోట్లమంది భక్తులు దర్శించుకునే తిరుమల వెంకన్న ఆయన నిర్వహణపై గతంలో ఏన్నడూ లేని వివాదాలు తలెత్తున్నాయి. ప్రభుత్వ అధీనంలో ఉంటే రాజకీయాలు తప్పవని, మసీదుల్లా, చర్చీల్లా టీటీడీని ప్రభుత్వంతో సంబంధం లేని సంస్థగా మార్చాలనే డిమాండ్లూ వస్తున్నాయి. మరోపక్క.. తాజాగా నియమించిన పాలక మండలి కూర్పుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం తనకిష్టులైన వారికి సభ్యత్వం కట్టబెట్టిందని టీడీపీ, బీజేపీ మండిపడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు పెనక శరత్ చంద్రారెడ్డిని పాలక మండలిలోకి తీసుకోవడం సరికాదని అంటున్నారు. అలాగే బోర్డులో తిష్టవేసిన తమిళనాడు ఆడిటర్ కృష్ణమూర్తి వైద్యనాథన్‌ను ఇంకా ఎన్నాళ్లు భరించాలని ఆందోళన వ్యక్తమవుతుంది. చైర్మన్లు, సీఎంలు మారినా ఆయన శాశ్వత సభ్యుడిగా మిగిలిపోయేలా ఉన్నారని అంచనా వేస్తున్నారు. చెన్నైకి చెందిన వైద్యనాథన్ దాదాపు తొమ్మిదేళ్లుగా బోర్డులో కొనసాగుతున్నారు. నాలుగు బోర్డుల్లో ఆయన కొన్ని నెలల మినహా 2015 నుంచి స్వామివారి సేవలో తరిస్తున్నారు. పాలకమండలి సభ్యుడిగా వైద్యనాథన్ తిరుమల తిరుపతి ఆలయాల్లో హల్‌చల్ చేస్తుంటారు. జపతపాలు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

బాబు టు జగన్

వైద్యనాథన్ తమిళనాడులో పేరుమోసిన ఆడిటర్. రాజకీయ నాయకులతో, పారిశ్రామికవేత్తలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. 2015లో చంద్రబాబు హయాంలో ఆయన తొలిసారి టీటీడీ బోర్డులోకి వచ్చారు. ఓ మహిళామంత్రి రెకమెండేషన్‌తోనే ఆయనను తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2018లో ఏర్పడిన ఏర్పడిన బోర్డులో ఆయకు చోటు దక్కలేదు. అయితే 2019 సెప్టెంబర్ నెలలో జగన్ ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేసి ఆయనను తీసుకుంది. తర్వాత 2021లో నియమించిన బోర్డులో వైద్యనాథన్‌కు చోటు దక్కలేదు. తెరవెనక ఏదో జరిగి మళ్లీ పీఠం దక్కించుకున్నారు. వేమిరెడ్డి ప్రశాంతి అనే సభ్యురాలితో రాజీనామా చేయించి మరీ సీటు కట్టుబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఏర్పడిన బోర్డులోనూ ఆయనకు చోటు దక్కింది. ఓ కేంద్ర మంత్రి సిఫార్సుతోనే మళ్లీ తీసుకున్నట్లు సమాచారం. టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఆ హోదాతో గుడిలో ఏవో పనుల పేరుతో స్వేచ్ఛ తిరిగే వీలుతోపాటు అయినవారికి అన్నీ చక్కబెట్టించే సదుపాయం కూడా ఉంది. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు.. జీవితంలో ఒక్కసారైనా టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పనిచేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. వచ్చే ఎన్నికల తర్వాత సీఎంగా జగన్ వచ్చినా, చంద్రబాబు వచ్చిన వైద్యానాథన్‌కు టీటీడీ బోర్డు సభ్యత్వం ఖాయమని టీటీడీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి.


Updated : 27 Aug 2023 9:27 PM IST
Tags:    
Next Story
Share it
Top