Telangana Bathukamma Festival : సద్దులకు సర్వం సిద్ధం.. నేటితో ముగియనున్న పూల పండుగ..
X
ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పూలపండుగ ఇవాళ్టితో ముగియనుంది. చివరి రోజున సద్దులతో బతుకమ్మ గంగమ్మ ఒడికి చేరనుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటనున్నాయి. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ ఉయ్యాల పాటలు హోరెత్తనున్నాయి.
సద్దుల బతుకమ్మ సంబురాలకు ఊరూవాడ సిద్ధమైంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణ ఆడబిడ్డలందరూ అత్యంత సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. 9వ రోజున 9 దొంతరలుగా బతుకమ్మను పేర్చి, అంతా ఒకచోట చేరి ఆడి పాడి బతుకమ్మలను గంగమ్మలో నిమజ్జనం చేస్తారు. కులాలకు అతీతంగా, పేద ధనిక తారతమ్యం లేకుండా, చిన్న పెద్ద అందరూ కలిసి ఘనంగా ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. నే పండుగ ఈ బతుకమ్మ పండుగ.
సద్దుల బతుకమ్మ నాడు తంగేడు, గునుగు, కట్ల, చేమంతి, బంతి, మల్లె, మొల్ల, మొగలి, సంపెంగ, కలువ, తామర పూలతో సద్దుల బతుకమ్మను పేర్చి సాంప్రదాయబద్దంగా గౌరమ్మను పూజిస్తారు. రాగిపళ్ళెంలో తంగేడు ఆకులు అమర్చి వాటిపై తంగేడు పూల కట్టలు పేర్చి, మధ్య మధ్యలో ఇతర పూలను వినియోగిస్తూ బతుకమ్మను అందంగా తీర్చిదిద్దుతారు. పసుపుతో గౌరమ్మను తయారు చేసి పెడతారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను పూజించి, సాయంత్రం ఆడబిడ్డలందరూ అందంగా ముస్తాబై ఒక చోటకు చేరుతారు. బతుకమ్మలను మధ్యలో పెట్టి ఉయ్యాల పాటలతో ఆడి పాడుతారు. బతుకమ్మకు గంగమ్మ ఒడికి చేర్చి నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడంతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి.